తెలంగాణలో ఐటీ, ఈడీ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. పలు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తోపాటు కరీంనగర్ లో ఈడీ, ఐటీ అధికారులు గ్రానైట్ వ్యాపారుల ఇళ్ళలో తనిఖీలు చేపట్టారు.
మంత్రి గంగుల కమలాకర్ తోపాటు గ్రానైట్ బిజినెస్ చేసే వారి నివాసాలలో, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్ ను విదేశాలకు తరలింపు విషయంలో ఫేమా నిబంధనలను ఉల్లఘించారని ఆరోపణలతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రానైట్ పరిశ్రమకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
హైదరాబాద్ పంజాగుట్టలో, హైదర్ గూడలోని జనప్రియ అపార్ట్ మెంట్ లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. సోమాజీగూడలో గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ నివాసంలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. 20 బృందాలుగా ఏర్పడి ఈ సోదాలు చేస్తున్నారు అధికారులు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది.