ఉద్యోగం పేరుతో అమెరికాలో స్థిరపడిన భారతీయుల పరిస్థితి పూర్తిగా తలకిందులు అవుతోంది. మంచి ఉద్యోగం దొరికింది.. ఏ చీకు , చింత లేదని ఇన్నాళ్ళు సంబరపడిన వాళ్ళంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. అక్కడి ఐటీ సంస్థలు లేఆఫ్ పేరుతో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుండటంతో భారతీయులు దిక్కులేనివాళ్ళుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆర్ధిక మాంద్యం బూచి చూపి పెద్ద, పెద్ద ఐటీ సంస్థలే రాత్రికి రాత్రే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలా కొలువులు కోల్పోయిన వాళ్ళలో 30నుంచి 40శాతం ఉద్యోగులు భారతీయులే ఉన్నారు. అందులో తెలుగువారే ఎక్కువగా ఉన్నారు.
ఉద్యోగం పోతే పోయింది కాని దీనికి తోడు హెచ్-1బీ వీసా నిబంధనల కత్తి వీరి మెడపై వేలాడుతోంది. ఈ విసాతో అమెరికాలోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఉద్యోగం కోల్పోతే 60రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి లేదంటే స్వదేశానికి వెళ్లిపోవాలి. కొత్త ఉద్యోగం దొరక్క.. ఉన్న ఉద్యోగం పోవడంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు. పేరు మోసిన సంస్థలే ఉద్యోగులను తొలగిస్తుండటంతో చిన్న , చిన్న కంపెనీలు కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేసుకునే పరిస్థితి లేదు. దీంతో ఉద్యోగాలను కోల్పోయిన వారికీ అరవై రోజుల్లో కొత్త ఉద్యోగం దొరక్కడం కష్టంగా మారింది. అరవై రోజుల్లో మరో ఉద్యోగం దొరక్కపోతే ఆ ప్రభావం కుటుంబాలపై పడుతుంది. ఉన్నపళంగా స్వదేశానికి వెళ్ళాల్సి వస్తే చదువుకునే పిల్లల పరిస్థితి ఏంటనే బాధ కొన్ని వందల కుటుంబాలను కుంగదీస్తోంది.
కొలువులు కోల్పోయిన వారంతా ఎదో ఉద్యోగం సంపాదించుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసి తెలిసిన వ్యక్తుల ద్వారా ఉద్యోగం వివరాలు తెలుసుకుంటున్నారు.