బీఆర్ఎస్ నేతల ఇళ్ళు, నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలకు చెందిన సంస్థలు, ఇళ్ళలో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఒకే సమయంలో ఈ ముగ్గురు నేతల ఇళ్ళలో ఇన్ కంట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీలో ఈ ముగ్గురు నేతలు మంచీ సౌండ్ పార్టీలు కావడంతో ఈ ముగ్గురి నేతలపై ఐటీ అధికారులు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి జేసీ బ్రదర్స్ అనే వస్త్ర దుకాణాలు, బంగారం దుకాణాలు ఉన్నాయి. కొత్త ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ కు అత్యంత సన్నిహిత నేతగా గుర్తింపు ఉంది. పైళ్ల శేఖర్ రెడ్డికి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. దీంతో బీఆర్ఎస్ సౌండ్ పార్టీలపై ఐటీ దాడులు జరిగినట్లు కనిపిస్తోంది. కొంతకాలం క్రితం మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు జరగగానే మరికొంతమందిపై దాడులు జరిగే అవకాశం ఉందని స్వయంగా కేసీఆరే పార్టీ నేతలను హెచ్చరించారు. కానీ మల్లారెడ్డి సంస్థలో దాడుల తరువాత ఐటీ దాడులు తగ్గిపోయాయి.
బీజేపీపై యుద్దవిరమణ చేసిన కేసీఆర్ ఆ పార్టీ జోలికి వెళ్ళడం లేదు. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు. కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ నేతల ఇళ్ళపై ఐటీ దాడులు జరగడం ఆ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. కొద్ది రోజులుగా దర్యాప్తు సంస్థలు సైలెంట్ కావడంతో బీఆర్ఎస్ – బీజేపీ మధ్య అవగాహనా కుదిరిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇది నిజమేనని అనుకునేలా ఉందని కొంతమంది బీజేపీ నేతలు కూడా పేర్కొనడంతో బీజేపీ స్టాండ్ మార్చిందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.