తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని ఓడించేందుకు క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న ఈసారి బరిలో ఉంటానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ సర్కార్ అవినీతిపై అలుపెరగకుండా పోరాడుతోన్న మల్లన్నకు ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతునిస్తుందని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో టీజెఎస్ సోషల్ మీడియా చేస్తోన్న ప్రచారం అనేక అనుమానాలకు తెరలేపుతోంది.
మేడ్చల్ నుంచి కోదండరాం బరిలో ఉంటారని టీజేఎస్ పార్టీ లీకులు ఇస్తోంది. ఆయనకు కాంగ్రెస్ మద్దతునివ్వాలని సోషల్ మీడియా క్యాంపైన్ కొనసాగుతోంది. అయితే ఇదంతా తీన్మార్ మల్లన్నను ఓడించేందుకు జరుగుతోన్న కుట్ర అని అంటున్నాయి రాజకీయ వర్గాలు. మేడ్చల్ లో మల్లారెడ్డి తీవ్ర వ్యతిరేకత కూడగట్టుకున్నారు. అదే సమయంలో మల్లన్న మంత్రి మల్లారెడ్డి భూకబ్జాల బాగోతాన్ని ఎప్పటికప్పుడు బయటపెడుతూ వస్తున్నారు. దీంతో మేడ్చల్ లో మల్లారెడ్డిని ఓడించడం మల్లన్నకు సాధ్యం అనే వాదనలు వస్తుండగా… కోదండరాం బరిలో ఉంటారని తాజాగా జరుగుతోన్న ప్రచారం అందర్నీ అయోమయానికి గురి చేస్తోంది.
తీన్మార్ మల్లన్న, కోదండరాంలు మల్లారెడ్డి ప్రత్యర్దులుగా పోటీలో ఉండటం ద్వారా అది బీఆర్ఎస్ కు లాభిస్తుంది. అచ్చం నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల తరహాలో. ఎందుకంటే నాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీజెఎస్ నుంచి కోదండరాం, స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నలు పోటీ చేశారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిపోవడంతో పల్లా అతికష్టం మీద గట్టెక్కారు. నాడు కోదండరాం తీన్మార్ మల్లన్నకు మద్దతునిచ్చి ఉంటే బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయేవారు. కానీ కోదండరాం ఏం ఆలోచించారో కానీ పోటీలో ఉండటంతో బీఆర్ఎస్ గెలిచింది.
బీఆర్ఎస్ ను ఓడించాలని మాట్లాడుతున్న కోదండరాం మేడ్చల్ బరిలో నిలిస్తే అది అంతిమంగా బీఆర్ఎస్ కు లాభిస్తుంది. గజ్వేల్ లో కోదండరాం పోటీలో ఉంటారని ఇటీవలి ప్రచారం జరిగింది. మళ్ళీ సడెన్ గా ఆయన మేడ్చల్ బరిలో ఉంటారని ప్రచారం జరుగుతుండటంతో మల్లన్న ఓటమి కోసం తెరవెనక ఏదో జరుగుతుందన్న అభిప్రాయాలూ విస్తృతంగా వినిపిస్తున్నాయి. అయితే.. మేడ్చల్ నుంచి పోటీ చేయాలనే ఆలోచనను కోదండరాం విరమించుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Also Read : కేసీఆర్ పై ఈటల..కేటీఆర్ పై బండి.. హరీష్ పై బూర నర్సయ్యలు పోటీ… బీజేపీ జాబితా, స్ట్రాటజీ ఇదేనా..?