కాంగ్రెస్ వార్ రూమ్ సీజ్ అంశం వ్యూహత్మక తప్పిదమని సీఎం కేసీఆర్ భావిస్తున్నారా..? ఈ పరిణామంతో కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలనుకుంటే సీన్ రివర్స్ అయిందా..? అనసవరంగా కాంగ్రెస్ ను కెలికి ఆ పార్టీకి ఊపు తీసుకొచ్చామని కేసీఆర్ లో అంతర్మథనం మొదలైందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
కాంగ్రెస్ సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపి.. టెక్నికల్ గా ఆ పార్టీని బలహీపర్చాలనుకుంది టీఆర్ఎస్. అందులో భాగంగా మాదాపూర్ లోని కాంగ్రెస్ వార్ రూమ్ ను సైబరాబాద్ పోలీసులు మంగళవారం సీజ్ చేశారు. కవితను లిక్కర్ క్వీన్ అంటూ అసభ్యకరంగా మార్ఫింగ్ ఫోటోలతో పోస్టులు చేశారని ఆఫీసుపై దాడి చేసినట్లు చెప్పారు. మా పార్టీ వార్ రూమ్ ను సీజ్ చేస్తారా..? అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారమంతా దశలవారీగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇంకేముంది.. పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలతో చెలరేగిపోయారు.
ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. ఒక్కసారిగా నేతలు దూసుకెళ్ళడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసనలు తెలిపారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను ఎక్కడిక్కడ దహనం చేశారు. పార్టీ అసంతృప్త నేతలు సైతం ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి పిలుపునిస్తే సీనియర్లమైన తాము నిరసనలో పాల్గొనాలా..? అంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేసే జగ్గారెడ్డి కూడా నిరసన తెలిపారు. సీబీఐని ఏం పీకలేక మాపై దాడులు చేస్తారా అంటూ తన సహజశైలిలో విమర్శలు చేశారు. ఆయనతోపాటు మరికొంతమంది సీనియర్ నేతలు కూడా స్వరం పెంచేశారు.
కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి చేసి సాంకేతికంగా దెబ్బకొట్టొచ్చని భావించిన సర్కార్ కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలతో అవాక్కయింది. ఎప్పుడు లేని విధంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించినట్లు నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. ఈ క్రమంలోనే విడివిడిగా ఉన్న కాంగ్రెస్ నేతలను, క్యాడర్ ను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ బ్యాక్ ఆఫీసు సీజ్ అంశం ఆ పార్టీకి ఉపయోగపడినట్లుందని టీఆర్ఎస్ బాస్ భావిస్తున్నారు.