నీరాకు వేదామృతం అని పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం పట్ల బ్రాహ్మణ, గౌడ కులస్థుల మధ్య వివాదం రాజుకుంది. వేదాలను కించపరిచేలా నీరా( కల్లు) కు ఆ పేరు ఎలా పెడుతారని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ పేరును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
నీరా అంటే మత్తు పదార్థం కానే కాదు. కల్లును మత్తు లేకుండా చేసి తాగేదే “నీరా”. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా బ్రాహ్మణ సంఘాలు రచ్చ చేస్తున్నాయి. ప్రకృతిసిద్ధంగా వచ్చిన నీరా స్వచ్ఛమైనదని తెలిపే ఉద్దేశంతో వేదామృతమని పేరు పెడితే బ్రాహ్మణ సంఘాలు రచ్చ చేయడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. మత్తు పదార్థానికి వేదామృతం అని పేరు పెడితే తప్పుపట్టాల్సింది కాని, మత్తు లేని పానీయానికి వేదామృతం అని నామకరణం చేస్తే బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ఎందుకు అభ్యంతరం చేస్తున్నారో తెలియడం లేదు.
నీరా కేఫ్ పేరును వేదామృతం అని పేరు పెడితే రచ్చ చేస్తోన్న బ్రాహ్మణ సంఘాలు…అదే వైన్స్ , బార్ లు దేవుళ్ళ పేర్లతో వెలుస్తున్నాయి. కాని ఏనాడూ వైన్స్ దుకాణాలకు దేవుళ్ళ పేర్లను ఎలా పెడుతారని ప్రశ్నించలేదు.
సిద్ది వినాయక, సాయి గణేషా, కనకదుర్గ, శ్రీ వెంకటేశ్వర, లక్ష్మి దేవి, శివ శంకర అని దేవుళ్ళ పేర్లతో వేలాది వైన్స్ దుకాణాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి. కాని వాటిని బ్రాహ్మణ సంఘాలు ఏనాడూ వ్యతిరేకించలేదు.
వైన్స్ లో లభించే వాటిలో అన్ని మత్తు పానీయలే. అలాంటప్పుడు.. బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం చెప్పాల్సింది నీరా కేఫ్ పేరుపై కాదు. ముందు ఉద్యమించాల్సింది వైన్స్ దుకాణాల పేరు మార్పుపై అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే మంచింది.
Also Read : బైరి నరేష్ అలా మాట్లాడొచ్చా..?