తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు కేసీఆర్ ముఖ్య సలహాదారు పదవి కట్టబెట్టారు. ఇప్పటికే రాజీవ్ శర్మ అనే మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇదే పదవి కట్టబెట్టి పదవిలో కొనసాగిస్తున్నారు. ఆయన మాత్రం పూర్తిగా పాలన వ్యవహారాలను మాత్రమే చూస్తున్నారు. ఇప్పుడు సోమేశ్ కుమార్ కు పదవిని కట్టబెట్టడం ద్వారా ఉత్తరాది పార్టీ వ్యవహారాలను ఆయన చూస్తారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
నిజానికి సోమేశ్ కుమార్ కు రాజకీయాలపై చాలా ఆసక్తి ఉంది. సీఎస్ గా ఉన్న సమయంలో సర్వేలు కూడా చేయించి కేసీఆర్ కు ఇచ్చేవారు. ధరణి పోర్టల్ అంశంలో కేసీఆర్ కు పూర్తిగా భరోసా ఉన్నాడు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో మంచి సంబంధాలే ఉన్నాయి. ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చాక ఆయన బీఆర్ఎస్ రాజకీయ కార్యకలాపాల్లో భాగస్వామ్యం అవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే సోమేశ్ కుమార్ ఆసక్తిని గమనించిన కేసీఆర్, సోమేశ్ సేవలను పార్టీ విస్తరణ కోసం వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి సోమేశ్ ను బీహార్ రాష్ట్ర ఇంచార్జ్ గా నియమించాలనే చర్చ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు అలా చేస్తే సీఎస్ గా కొనసాగిన సమయంలో సోమేశ్ కుమార్ బీఆర్ఎస్ కోసం పని చేశాడన్న విమర్శలు వస్తాయని వెనక్కి తగ్గినట్లు సమాచారం.
సోమేశ్ కుమార్ కు కీలక పదవి కట్టబెట్టే విషయంలో అన్ని అంశాలను పరిశీలించి చివరికి సలహాదారు పదవిని అప్పగించారు కేసీఆర్. ఆయన హిందీ రాష్ట్రాల బీఆర్ఎస్ బాధ్యతల్ని చూస్తారని… కేసీఆర్ గైడ్ లైన్స్ మేరకు పని చేస్తారని అంటున్నారు.