రాజకీయ అవకాశవాదులలో కేసీఆర్ మించిన తోపు ఎవరూ లేకుండొచ్చు. అవసరానికి ఎవర్ని ఎలా వాడాలో, ఎవరిని వదిలించుకోవాలని ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అలా కేసీఆర్ రాజకీయ అవకాశవాదానికి బలై రాజకీయాలను వదిలేసినా వారు కొంతమందైతే, మరికొంతమంది పక్క పార్టీలోకి జంప్ చేసిన పరిస్థితి. టీఆర్ఎస్ లో ఎలాంటి ప్రాధాన్యత లేక పక్కనపెట్టేయడంతో బీజేపీలో చేరిన స్వామి గౌడ్ ను ఇటీవల తిరిగి సొంతగూటికి తీసుకొచ్చారు. పలు విషయాలపై అనర్గళంగా మాట్లాడే దాసోజు శ్రవణ్ ను కూడా గతంలో పక్కన పెట్టేయడంతో ఆయన కాంగ్రెస్ , బీజేపీలో చేరి కేసీఆర్ ఆహ్వానం మేరకుమళ్ళీ కారెక్కారు.
మునుగోడు ఉప ఎన్నికల వేళ బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను బీజేపీలో చేర్చుకున్నారు. దీంతో ఆ పార్టీని తిరిగి దెబ్బకొట్టేందుకు గౌడ సామజిక వర్గానికి చెందిన స్వామి గౌడ్ తోపాటు మరో బీసీ నేత దాసోజు శ్రవణ్ ను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో అవసరానికి ఈ ఇద్దరి నేతల సేవలను వాడుకున్న కేసీఆర్ తరువాత పక్కనపెట్టేయడంతో సైడ్ అయ్యారు. కేసీఆర్ దర్శనం చేసుకునేందుకు స్వామి గౌడ్ పలుమార్లు అపాయింట్ మెంట్ కోరినా కరుణించలేదు.
ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి పోరాట పంథాకు మెచ్చి కాంగ్రెస్ లో స్వామి గౌడ్ చేరాలనుకున్నారు కాని, టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ ఉండటంతో కాంగ్రెస్ ను కాదనుకుని బీజేపీలో చేరారు. ఈ క్రమంలోనే వచ్చిన మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ మునిగిపోయే ప్రమాదం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో కేసీఆర్ లోని రాజకీయ అవకాశవాదం మళ్ళీ బయటకొచ్చింది. ఇంకేముంది దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్ లకు కేసీఆర్ పిలుపు అందింది. వీరిద్దరికీ పదవులను ఇస్తామని హామీ ఇచ్చి టీఆరెఎస్ కండువా కప్పేశారు.
పార్టీలో చేరికల సమయంలో టీఆర్ఎస్ ఆఫీసులో కనిపించిన ఈ ఇద్దరి మొహాలు మళ్ళీ మీడియాకు పెద్దగా కనిపించలేదు. బీఆర్ఎస్ ఆవిర్భావం సమయంలోనూ , ఢిల్లీలో పార్టీ ఆఫీసు ఓపెనింగ్ టైంలోనూ ఈ నేతలు ముఖ్య నేతల మధ్య ఎక్కడా కనిపించలేదు. దీంతో ఈ ఇద్దరు నేతలను కేసీఆర్ రాజకీయ అవకాశ వాదం కోసం వినియోగించుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి.కేసీఆర్ పొలిటికల్ గేమ్ లో మరోసారి మోసపోయారన్న అభిప్రాయాలు వస్తున్నాయి. చూడాలి రానున్న రోజుల్లోనైనా ఎదో ఒక పదవి ఇచ్చి వారిని సాటిస్ఫై చేస్తారో లేదో.