తెలంగాణలో ముందస్తు ఎన్నికల నగారా మోగడం ఖాయంగా కనిపిస్తోంది. బడ్జెట్ సమావేశాలను నెల రోజుల ముందుగానే నిర్వహించడం…వరుసగా బహిరంగ సభలు ఏర్పాటు చేయడం చూస్తుంటే కేసీఆర్ ముందస్తుకు ఫిబ్రవరిలోనే ముహూర్తం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.
ఫిబ్రవరి 13న మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభ ముగిసిన నాలుగు రోజుల వ్యవధిలోనే కేసీఆర్ అదే స్థలంలో బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 17 న సచివాలయం ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. అదీ కూడా మోడీ సభను తలదన్నేలా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సభకు జాతీయ నేతల్ని ఆహ్వానిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ఇలా అందర్నీ పిలుస్తున్నారు. వీరిలో ఎవరెవరు వస్తారన్నది స్పష్టత రావాల్సి ఉంది.
అయితే..ఈ బహిరంగ సభకు మునుపే అసెంబ్లీ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. 3న బడ్జెట్‌ను ప్రవేశపెట్టి 13వ తేదీకి మునుపే సభ సమావేశాలను ముగించాలని సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ పర్యటనకు రానున్న మోడీ ఎలాంటి రాష్ట్ర అభివృద్దికి హామీలు ఇచ్చారు..? కేంద్రం తెలంగాణపై ఎలా వివక్ష ప్రదర్శిస్తోందన్న అంశాలపై ఫిబ్రవరి 17న జరిగే సభలో కేసీఆర్ నివేదించే సూచనలు ఉన్నాయి. అచ్చంగా.. గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేముందు కొంగరకొలాన్ లో సభ నిర్వహించిన కేసీఆర్… ఆ తరువాత కొన్ని రోజుల వ్యవధిలోనే అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కొంగర కొలాన్ సభ మాదిరి పరేడ్ గ్రౌండ్ సభ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఆ తరువాత ఫిబ్రవరి నెలాఖారులో కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
కేసీఆర్ ముందస్తుకు వెళ్తే కేంద్రం సహకరిస్తుందా..? అన్నది ప్రశ్నగా మారింది. ముందస్తుకు కేసీఆర్ వెళ్ళాడంటే అందుకు కేంద్రం సహకరిస్తామనే హామీతోనే అయి ఉంటుందన్న అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.