పేరుమోసిన స్వామిజీల ఆశీస్సుల కోసం గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్యాత్మిక క్షేత్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బీజేపీకి కౌంటర్ గానే ఆమె ఆధ్యాత్మిక మార్గం ఎంచుకున్నారన్న అభిప్రాయాలు వినిపించాయి. కానీ ఆమె హిందూ దేవాలయాలు , పేరుమోసిన బాబాల చుట్టూ అదేపనిగా తిరిగేందుకు అసలు కారణం మరొకటి ఉందన్న మాట వినిపిస్తోంది.
ఎమ్మెల్సీ కవిత. ముఖ్యమంత్రి కేసీఆర్ గారాలపట్టి. కేటీఆర్ కంటే కూడా కవితకే వ్యక్తిగతంగా కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని బీఆర్ఎస్ నేతలు చెప్పేమాట. అలాంటి కవితకు పెద్ద కష్టమొచ్చింది. లిక్కర్ స్కామ్ లో ఆమె పేరు మారుమోగుతోంది. సీబీఐ అధికారులు ఈ విషయమై నోటిసు ఇచ్చి విచారించారు కూడా. త్వరలోనే కవితను మరోసారి విచారిస్తారని కేంద్ర దర్యాప్తు సంస్థలు లీకులు ఇస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసిన దర్యాప్తు సంస్థలు ఒక్కొక్కరిని అరెస్ట్ చెస్తున్నాయి.
లిక్కర్ స్కామ్ లో బోయినపల్లి అభిషేక్ రావు, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబులను అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణంలో కవితే కింగ్ పిన్ అని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అందుకే ఆమె టార్గెట్ గా లిక్కర్ స్కామ్ నిందితులను విచారిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. త్వరలోనే కవిత భర్త అనిల్ ను కూడా విచారించే అవకాశం ఉందని కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకోస్తోంది. కవిత టార్గెట్ గా దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచుతున్నా అదే స్థాయిలో కవిత కూడా కేంద్రంపై ఫైర్ అవుతున్నారు.
కక్షగట్టి దర్యాప్తు సంస్థలను తమపైకి ఎగదోస్తున్నారని కవిత అంటున్నారు. ఈడీ వచ్చినా బోడి వచ్చినా.. మోడీ వచ్చినా ఇసుమంత కూడా భయపడబోమని.. ఇక్కడున్నది కేసీఆర్ కూతురు కవిత అంటూ గద్గద స్వరంతో మాట్లాడారు. ఆమె ధైర్యానికి అంతా ఫిదా అయ్యారు. కానీ కేసీఆర్ లాగే లోలోపల కవిత కూడా లిక్కర్ స్కామ్ విషయంలో ఆందోళన చెందుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తనను అరెస్టు చేసే పరిస్థితులను మార్చేందుకు అథ్యాత్మిక మార్గాన్ని కవిత ఎంచుకున్నట్లుగా చెబుతున్నారు.
పేరుమోసినా స్వామీజీల గురించి ఎవరు చెప్పినా వారికీ సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పరిశీలించి…అంత ఒకే అనుకుంటే అక్కడికి వెళ్లి స్వామీజీ ఆశీస్సులు పొందుతున్నట్లు చెబుతున్నారు. పూజలు, హోమాలు, జపాలు కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇంతకు ముందే కవిత అరెస్ట్ జరగాల్సి ఉన్నా… ఎదో అంశం వలన నిలిచిపోవడంతో అదంతా స్వామీజీల దీవెనల ఫలితమేనని కవిత నమ్ముతుందట.