కర్ణాటకలో బీజేపీ అధికారం కోల్పోవడంపై రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ.. ఇక సౌత్ పై బీజేపీ ఆశలు వదిలేసుకోవాల్సిందేనని చెబుతున్నారు. కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోని బీజేపీ.. తెలంగాణపై ఆశలు పెట్టుకోవడం దండగ అని సూచిస్తున్నారు. నిజానికి తెలంగాణలో బీజేపీకి ఏమంత బలం లేదు. బీజేపీ రేసులోకి వచ్చిందనే ప్రచారం చేసుకోవడానికి ప్రధాన కారణం మీడియా బలమే తప్పితే అసలు బీజేపీకి అధికారంలోకి వచ్చేంత సీన్ లేదని గ్రౌండ్ రియాలిటీని చెప్పేస్తున్నారు. ఆ పార్టీకి పట్టుమని పది మంది అభ్యర్థులు గట్టి వారు లేరు. ఢిల్లీ నుంచి నేతలు ఎంత ఫోకస్ చేస్తున్నా తెలంగాణ బీజేపీలోకి చేరికలు ఉండటం లేదు. దీంతో తెలంగాణపై ఆశలు పెట్టుకోవడం అత్యాశే అవుతుందని.. కర్ణాటక ఫలితం కమలనాథులు కన్ను తెరిపించినట్టేనని అంటున్నారు.
దక్షిణ భారత దేశంలో ఓసారి బీజేపీ ఉనికి పరిశీలిద్దాం. ఏపీలో ఆ పార్టీ ఏమాత్రం బలంగా లేదు. పొత్తుల కోసం కిందామీదా పడుతోంది. తమిళనాడులో ఎదగడానికి ప్రయత్నిస్తున్నా అక్కడ బీజేపీ బలపడటం కష్టమే. కేరళలో పాతుకుపోవడానికి సాధ్యమయ్యే పరిస్థితి లేదు. మహారాష్ట్రలో మాత్రమే కొంచెం ఆశలు ఉన్నాయి. ఇక తెలంగాణలోనూ మతం పేరుతో రాజకీయం చేయాలని ట్రై చేస్తున్నారు కానీ చైతన్యవంతమైన తెలంగాణ సమాజం బీజేపీ మతతత్వ రాజకీయాలను ఎప్పటికప్పుడు పసికడుతు బీజేపీ ట్రాక్ లోకి అసలే వెళ్ళడం లేదు. ఎలా చూసినా దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఆశలు గల్లంతయినట్లేనని చెప్పుకోవచ్చు.
ఇప్పటికే బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే ముద్ర ఉంది. ఆ పార్టీకి ఉత్తరాదిన వస్తున్నా సీట్లతోనే కేంద్రంలో అధికారంలో కొనసాగుతోంది తప్పితే దక్షిణాదిన ఏమాత్రం ఆశాజనకమైన సీట్లు రావడం లేదు. ఆ పార్టీకి ఉన్న 303 సీట్లలో 90 శాతానికిపైగా ఉత్తరాది నుంచి వచ్చేవే. అయితే, ప్రతిసారి నార్త్ నుంచే ఎక్కువ సీట్లు రాకపోవచ్చు కాబట్టి సౌత్ పై ఫోకస్ పెట్టింది బీజేపీ. కర్ణాటకలో అధికారాన్ని కైవసం చేసుకొని దక్షిణాదిన దుమ్ము రేపాలనుకుంది కానీ ఆశలన్నీ ఆడియాశలయ్యాయి. అందుకే ఇప్పుడు బీజేపీ కంగారు పడుతోంది.