తెలంగాణ బీజేపీలో కొత్త దందాకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెరతీశాడని కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతోంది. టికెట్లు ఆశిస్తోన్న కొంతమంది నేతల నుంచి బండి సంజయ్ టీం డబ్బులు దండుకుంటున్నారాని ఆరోపణలు కూడా ఉన్నాయి. 2024వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతాడని అధిష్టాన పెద్దలు స్పష్టం చేయడంతో… ఎన్నికలకు ఆయన సారధ్యంలో వెళ్తారని తేలింది. దీంతో ఎమ్మెల్యే టికెట్ ఆశావహులు బండి సంజయ్ మెప్పు కోసం పాకులాడుతున్నారు. ఇదే అదునుగా భావించిన బండి సంజయ్ తన టీంలోని ఒకరిద్దరి నేతల సహకారంతో పార్టీలో “పైసా వసూళ్లు” కు శ్రీకారం చుట్టాడని గుసగుసలు కమలం క్యాంప్ నుండే వినిపిస్తున్నాయి.
తెలంగాణలో మునుపటి కంటే బీజేపీ బలోపేతం అయిందనేది బహిరంగ రహస్యమే. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బీజేపీ ముచ్చెమటలు పట్టించింది. అనంతరం వరుస ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం.. పార్టీలోకి వలసలు పెరగడంతో బండి సంజయ్ కు అధిష్టానం వద్ద ప్రాధాన్యత మరింత పెరిగింది. ఓ సభలో బండి సంజయ్ ను ఏకంగా ప్రధాని మోడీ ఆకాశానికి ఎత్తేశారు. ఇక అధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేసిన బండి సంజయ్ తనకు పార్టీలో ఎదురేలేదని భావిస్తున్నారు. అందుకే ఆయనపై ఎన్ని ఫిర్యాదులు చేసినా హైకమాండ్ కూడా పట్టించుకోవడం లేదు. ఆ మధ్య బండి సంజయ్ పైసా వసూళ్ళ పర్వం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటలకు తెలియడంతో ఢిల్లీ అగ్రనేతలను కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తో కలిసి పార్టీలో బండి సంజయ్ కొత్త దందా స్టార్ట్ చేశారనే ఆరోపణలు వస్తుండగానే…సోషల్ మీడియాలో ఓ ఫ్లైయర్ తెగ చక్కర్లు కొడుతోంది. టికెట్లు ఇప్పిస్తామని పదిమంది నేతల నుంచి 37కోట్ల వరకు వసూళ్లు చేశారనే ఫ్లైయర్ వైరల్ అవుతోంది. రావు పద్మ ( వరంగల్ వెస్ట్ ) నుంచి 3.5కోట్లు, నందీశ్వర్ గౌడ్ (పఠాన్ చెరు ) 5 కోట్లు, ఆకుల శ్రీవాణి – (మహేశ్వరం ) 4కోట్లు, వడ్డేపల్లి రాజేశ్వర్ రావు (కూకట్ పల్లి ) 5 కోట్లు, లంక దీపక్ రెడ్డి (జూబ్లీహిల్స్ ) 3 కోట్లు, రవి కుమార్ యాదవ్ ( శేరిలింగంపల్లి ) 2కోట్లు మరియు విల్లా, తుళ్ళ వీరేందర్ గౌడ్ ( రాజేందర్ నగర్ )4కోట్లు, కూన శ్రీశైలం గౌడ్ (కుత్బుల్లాపూర్ )4 కోట్లు , నందికొండ గీతారెడ్డి ( మేడ్చల్ )3కోట్లు , మారుతి కిరణ్ ( పరిగి )3. 5కోట్లు వసూళ్లు చేశారని అందులో పేర్కొన్నారు.
ఈ పదిమంది నేతలకు పోటీగా స్థానికంగా ఇతర బీజేపీ నేతలు టికెట్ కోరుతున్నారు. దాంతో ఈ పదిమంది నేతలు టికెట్ విషయమై బండి సంజయ్ ను సంప్రదించగా.. బీజేపీలో తనకు అత్యంత సన్నిహిత నేత ద్వారా బండి సంజయ్ ఈ పైసా వసూళ్ళ కథను నడిపించారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ నేతే ఈ ఈ పదిమందితో మాట్లాడి టికెట్లపై బేరసారాలు నడిపారని.. బండి సంజయ్ తెరవెనక నుంచి ఈ కథను కొనసాగించారని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. కొంతమంది దీనిని కొట్టిపారేస్తున్నా.. నిప్పు లేకుండా పొగ ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు.
అయితే గతంలో ప్రజా సంగ్రామ్ యాత్ర కోసం పెద్ద ఎత్తున నిధులు సమీకరించి ఒక్కో నాయకుడికి ఇంతా అని రేట్ ఫిక్స్ చేసి కోట్లాది రూపాయలను బండి సంజయ్ టీం పోగేసుకున్నట్టు సొంత పార్టీ నాయకులే బహిరంగగా మాట్లాడుకున్నారు, కరీంనగర్ నగర్ గ్రానెట్ మాఫియా మీద సీబీఐకి ఫిర్యాదు చేసిన సంజయ్ అతర్వాత జరిగిన ఆర్ధిక ఒప్పందంతో సైలెంట్ అయ్యారనే చర్చ కూడా జరిగింది, మొత్తానికి బండి సంజయ్ బిజెపి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆర్ధికంగా బలపడ్డారని ఆయన పాత సన్నిహితులే మాట్లాడుకోవడం చూస్తుంటే ఇలాంటి ఆరోపణలకు బలం చేకూర్చుతుంది.
Also Read : బండి వర్సెస్ ఈటల – హైకమాండ్ కు పోటాపోటీగా ఫిర్యాదులు