టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరు వింటేనే పూనకంతో ఊగిపోయే ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎట్టకేలకు రేవంత్ తో కలిసిపోయారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయనతో సరదాగా మాట్లాడుతూ కనిపించారు. ఇక నుంచి రేవంత్ తో కలిసి కొట్లాడుతానని వ్యాఖ్యానించారు. రేవంత్ గురించి చెప్పాల్సిన విషయాలను ఇటీవలి ప్రెస్ మీట్ లో చెప్పెశానని, ఇక ఎన్నికలు ముగిసేవరకు రేవంత్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డితో జగ్గారెడ్డి ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ ఉండగా.. తమ మధ్య ఎలాంటి పంచాయితీలు లేవని రేవంత్ అన్నారు. తమ మధ్య ఉన్నది తోటి కోడళ్ళ పంచాయితీ మాత్రమేనని నవ్వుతు చెప్పారు. కొట్లాడాల్సిన చోట కోట్లడుకుంటాం. కలిసినప్పుడు మాట్లాడుకుంటామంటూ జగ్గారెడ్డి బదులిచ్చారు. మీడియాకు మాత్రం తాము కత్తుల దూసుకోవాలని ఉంటుందంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
ఇటీవల మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఇక నుంచి రేవంత్ ఏ కార్యక్రమం చేపట్టిన తప్పకుండా సహకరిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఒకవేళ రేవంత్ పాదయాత్ర చేపట్టినా తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. టీపీసీసీ అద్యక్ష పదవిని ఎన్నికలు ముగిసే వరకు తను అడగబోనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో రేవంత్ ఎదురుపడగా ఆయన సరదాగా ముచ్చటించారు.
రేవంత్ , జగ్గారెడ్డిలు అభిప్రాయ బేధాలను పక్కనపెట్టి ఐక్యం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.