అబ్బే జనసేనకు అంత సీన్ లేదు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆయన గెలువడమే ఎక్కువ. అలాంటిది ఆ పార్టీ పదుల సంఖ్యలో అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంటుందా..? అని ఇన్నాళ్ళు ప్రత్యర్ధులు పెదవి విరిచారు. తాజాగా విడుదల అయిన సర్వేలో మాత్రం జనసేనకు ఆదరణ పెరిగినట్లు తేలింది.
సినిమాలు, రాజకీయాలు. ఇలా బ్యాలెన్స్డ్ గా పవన్ రాజకీయాలు చేసినా జనసేన పది అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు దక్కించుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఇందులో అనకాపల్లి, కాకినాడ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అలాగే, ఉత్తరాంధ్ర , ఉభయ గోదావరి జిల్లాలో జనసేన బలం పుంజుకుంటున్నట్లు సర్వేలో తేలింది. విజయవాడ పశ్చిమ, గుంటూరు వెస్ట్, సత్తెనపల్లి, కర్నూలు ,పాణ్యం వంటి అసెంబ్లీ నియోకవర్గాల్లోనూ జనసేన దూకుడుగానే ఉందని సర్వే ఫలితాలు కనిపిస్తున్నాయి.
ఓ విధంగా చూస్తే ఈ సర్వే ఫలితాలు జనసేనకు ఆశాజనకంగానే ఉన్నాయి. ఎందుకంటే.. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఒక్క ఎంపీ సీట్ కూడా పీఆర్పీ కైవసం చేసుకోలేదు. అలాంటిది జనసేన రెండు లోక్ సభ స్థానాల్లో జెండా ఎగరేస్తుందంటే ఆషామాషీ కాదు. ఒక ఎంపీ సీట్లో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఆ లెక్కన చూస్తే జనసేన గెలుచుకునే ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగానే ఉండనుంది.
కాకినాడ, అనకాపల్లిలు జనసేనకు ఫేవర్ గా ఉన్నాయని.. ఇంకాస్త ఫోకస్ చేస్తే నర్సాపురం లోక్ సభ స్థానంలో కూడా జనసేనకు స్కోప్ ఉందని అంటున్నారు. కేవలం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే సర్వే చేయగా మిగిలిన ప్రాంతాల్లోనూ సర్వే చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయోనని జనసేన కార్యకర్తలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
పవన్ ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’ కదలనే లేదు. అయినా జనసేన భారీగా సీట్లతో దుమ్మురేపుతోంది. ఇక వారాహి రోడ్డెక్కి ప్రచారంలో దూసుకుపోతే సీట్ల స్థానాలు మెరుగయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నాటికి గ్రాఫ్ పెరిగి అది కాస్తా డబుల్ డిజిట్ అయ్యే చాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు. అయితే వచ్చే ఎన్నికలో జనసేన పొత్తులతో పోటీ చేస్తే ఒక లెక్క ఉంటుంది. అలా కాకుండా సొంతంగా పోటీకి దిగితే అప్పుడు త్రిముఖ పోటీ ఉంటుంది.