నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ ప్రారంభమైంది. నిందితుల్ని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. వారి వాయిస్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. నెక్ట్స్ సిట్ అధికారులు ఎం చేయబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఈ కేసులో నిందితులను విచారించి కేసును క్లోజ్ చేస్తారా..? అన్న ప్రశ్న తెరపైకి వస్తోంది. నిందితులతోపాటు నలుగురు ఎమ్మెల్యేలను కూడా విచారిస్తేనే అసలు విషయాలను కూపీ లాగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మొదట ఎవరిని ఎవరు సంప్రదించారు..? అనే విషయం బోధపడితే తప్ప ఈ కేసు ముందుకు సాగదు. కేసును పునాది నుంచి అధ్యయనం చేయాలంటే ఆ నలుగురు ఎమ్మెల్యేలను సైతం విచారించాల్సిందే. కాని సిట్ అధికారులు ఎమ్మెల్యేలను విచారణకు పిలుస్తారా..?లేదా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరిగాయనే విషయం బయటకు పొక్కగానే నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కు వెళ్ళిపోయారు. అంతకుముందే తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే ట్రాప్ జరిగింది. ఏదైనా కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగే సమయంలో ఇరు వర్గాల అభిప్రాయాలను తీసుకోవడం ఆనవాయితీ. కాని ఎమెల్యేల కొనుగోలు కేసులో మాత్రం పోలీసులు ఆ నలుగురు ఎమ్మెల్యేలను ప్రశ్నించడంలేదు. వారిని ప్రశ్నించేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారన్న ప్రశ్న వినిపిస్తోంది.
ఈ కేసుకు సంబంధించి ఆడియో , వీడియోలు తప్ప మరే ఇతర సాక్ష్యాలు లేవు. డబ్బు దొరికిందన్నారు కాని ఆ తరువాత డబ్బే లేదని పోలీసులు చెప్పారు. దీంతో ఈ కేసు ఇక వీగిపోయినట్లేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.