దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఎక్కువగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలపై ఫోకస్ చేస్తోంది. వచ్చే ఏడాది ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలుండటంతో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కర్ణాటకలోని రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ చేతుల్లోకి వచ్చాయి. కాని తెలంగాణలో మాత్రం పరిస్థితులు అందుకు విరుద్దంగా ఉన్నాయి. అయితే, తెలంగాణలో కనిపిస్తోన్న పరిస్థితులే హిమాచల్ ప్రదేశ్ లో ఎదుర్కొన్న కాంగ్రెస్ అక్కడ ఊహించని విజయం అందుకుంది. దాంతో తెలంగాణలోనూ గట్టిగా ఫోకస్ చేస్తే అధికారంలోకి రావడం అసాధ్యమేమీ కాదని అధిష్టానంకు అర్థమైంది.
హిమాచల్ ప్రదేశ్ లో ఎలాంటి వ్యూహాన్ని కాంగ్రెస్ అనుసరించిందో తెలంగాణలోనూ అదే స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలని పార్టీ భావిస్తోంది. ఇందుకోసం ప్రియాంక గాంధీ త్వరలోనే తెలంగాణపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేయనున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసాక.. ప్రియాంక గాంధీ తెలంగాణలో పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హిమాచల్ లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రియాంక గాంధీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రతి నియోజకవర్గం నేతలతో, కార్యకర్తలతో భేటీ అయి అక్కడి పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఇంటింటికి వెళ్లి సమస్యలను తెలుసుకొని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఫలితంగా హిమాచల్ ప్రదేశ్ లో బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ విజయం అందుకుంది. ఇదే ఫార్మూలాను తెలంగాణలో అమలు చేసే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణలో ప్రియాంక గాంధీ పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ మరింత బలం పుంజుకునే అవకాశం ఉంది. తెలంగాణలో ఇంటింటికి వెళ్లి సమస్యలను తెలుసుకోవడం ద్వారా రాష్ట్రంలో పొలిటికల్ సిట్యుయేషన్ మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రియాంక గాంధీ పాదయాత్రపై రాహుల్ గాంధీ యాత్ర అనంతరం అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.