ORR టెండర్లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ORR టెండర్ల సమాచారాన్ని ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని ఏజీని ప్రశ్నించింది. దీంతో నీళ్ళు నమిలిన ఏజీ, రేవంత్ కు పూర్తి సమాచారం ఇస్తామని కోర్టుకు నివేదించారు. రెండు వారాల్లోగా రేవంత్ అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని గడువును నిర్దేశించింది హైకోర్టు.
ఓఆర్ఆర్ టెండర్లపై సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరితే ఇవ్వలేదని, ఆర్టీఐ ద్వారా కోరినా ఇవ్వడం లేదని రేవంత్ చెప్పడంతో ప్రభుత్వంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీఐ ఉన్నది ఎందుకని విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ను ప్రశ్నించింది. దీంతో ఓఆర్ఆర్ టెండర్ కు చెందిన సమాచారాన్ని రేవంత్ కు ఇస్తామని అంగీకరించక తప్పలేదు.
ఓఆర్ఆర్ టెండర్లలో భారీ గోల్ మాల్ జరిగిందని, వెయ్యి కోట్ల రూపాయలు చేతులు మారాయని రేవంత్ ఆరోపణలు చేస్తూ జూలై 26న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముంబైకి చెంది సంస్థకు కట్టబెట్టడం వెనక బీఆర్ఎస్ హస్తం ఉందని రేవంత్ ఆరోపించారు. ఇందులో ఏమేం జరిగిందో తెలుసుకునేందుకు ఆర్టీఐ ద్వారా సంప్రదించారు. అయినా ఆర్టీఐ కూడా సమాచారం ఇవ్వకపోవడంతో రేవంత్ హైకోర్టును ఆశ్రయించారు. సమాచార హక్కు చట్టానికి కమిషనర్లు లేకపోవడంతో సమాచారం ఇవ్వడం లేదని పిటిషన్ లో రేవంత్ ప్రస్తావించారు.
రేవంత్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రజా ప్రతినిధులు అడిగిన సమాచారం ఇవ్వకపోతే చట్ట సభల్లో వారెలా మాట్లాడుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అందుకే ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో రేవంత్ కోరిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు…ఓఆర్ఆర్ టెండర్ విషయంలో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపణలన్నీ తప్పని హెచ్ఎండీఏ పరువు నష్టం పిటిషన్లు దాఖలు చేసింది. అవి కోర్టులో ఉన్నాయి.