స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో నిరాశే ఎదురైంది. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. సీఐడీ తరుఫు లాయర్ల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం చంద్రబాబు పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ను సవాల్ చేస్తూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 19న చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై ఆయన తరుఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని వాదించారు.
సీఐడీ తరుఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. చంద్రబాబును ఈ కేసులో అన్ని కోణాల్లో విచారించాల్సి ఉందని బలమైన వాదనలు వినిపించారు. చంద్రబాబు తరుఫు న్యాయవాదుల వాదనలను తిప్పికొట్టారు. హైకోర్టులో విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు హోరాహోరీగా జరిగాయి.
అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చింది. హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో చంద్రబాబు తరుఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.
Also Read : బ్రేకింగ్ – చంద్రబాబు రిమాండ్ పొడగింపు