టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వ తీరు సరిగా లేదంటూ సీనియర్లు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. ఆయన సారధ్యంలో పని చేయలేమంటూ ఒక్కొక్కరు హస్తానికి హ్యాండ్ ఇస్తున్నారు. రేవంత్ ఒంటెత్తు పోకడలతోనే పార్టీని వీడుతున్నామని చెప్తున్నారు. అందరితో సఖ్యతగా మెలగాలని చెప్పి రేవంత్ కు తెలంగాణ కాంగ్రెస్ సారధ్య బాధ్యతలను అప్పగించింది అధిష్టానం.
అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ.. సీనియర్లందరిని ఇంటికి వెళ్లి మరీ కలిసి పార్టీ కోసం ఐక్యంగా పని చేద్దామని కోరారు. అందుకు సీనియర్లు కూడా అంగీకరించారు. ఇక, కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు ఒకప్పటి మాటేనని అనుకున్నారు. పరిస్థితి కూడా చక్కబడటంతో కాంగ్రెస్ లో ఊపు కనిపించింది. అంతలోనే సీనియర్లు ఒక్కొక్కరు ఆధిపత్యం కోసం, అసహనంతో రేవంత్ పై విమర్శల వాగ్భానలను ఎక్కుపెట్టారు. వరుసగా నిరసన కార్యక్రమాలకు రేవంత్ పిలుపునిస్తూ పార్టీని జనాల్లోకి ప్రవాహంలా తీసుకుపోతున్న సమయంలో అసంతృప్తి సెగలను రాజేశారు. సీనియర్లకు నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. పార్టీని వీడుతున్నారు. ఈ సమయంలో రేవంత్ కు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.
సీనియర్ల అసంతృప్తి రాగాలు, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రస్తుతమున్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లలో కొంతమందిని తొలగించి కొత్త వారికీ అవకాశం ఇవ్వాలని, ఇందులో రేవంత్ వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. రాష్ట్రంలో రేవంత్ క్రేజ్ , పార్టీకోసం రేవంత్ అమలు చేస్తోన్న కార్యాచరణపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసి..కొత్తగా నియమించనున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లలో రేవంత్ అనుకూలురుకు అవకాశం ఇచ్చి , రేవంత్ కు ఫుల్ పవర్స్ ఇవ్వాలని చూస్తోంది.