తెలంగాణ హెల్త్ డైరక్టర్ గడల శ్రీనివాసరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హెల్త్ డైరక్టర్ గా కొనసాగుతున్న ఆయన మూఢనమ్మకాలకు జనాలు ఆకర్షితులు అయ్యేలా కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అవుతోంది.
ఖమ్మం జిల్లాలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న గడల శ్రీనివాసరావు, తాను ఈరోజు బ్రతికి ఉన్నానంటే కారణం తనకు కట్టిన తాయత్తు వలనేనని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ స్థాయికి చేరడంలోనూ తావీజ్ మహిమ ఉందంటూ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది. వైద్యులు నయం చేయలేని జబ్బును తాయత్తు నయం చేసిందంటూ వ్యాఖ్యానించారు. అలాగే పోలిటికల్ ఎంట్రీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజాసేవ చేయడమే అసలైన రాజకీయమని.. తనకు కేసీఆర్ టికెట్ ఇస్తే కొత్తగూడెం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కొత్తగూడెం నుంచి పోటీ చేసే ఆలోచనతోనున్న శ్రీనివాసరావు గత కొంతకాలంగా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు చేరువ అయ్యేందుకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవా చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనతోనే చేస్తున్నారని ప్రచారం జరుగుతుండగా ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఓ స్పష్టత వచ్చింది.
కాంట్రవర్సీలకు కేరాఫ్ అయిన శ్రీనివాస రావు గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనాను నివారించడంలో కృషి చేసిన వైద్యులను వదిలేసి ఏసుక్రీస్తు దీవెనలతో కరోనా తగ్గుముఖం పట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, గతంలో కేసీఆర్ పాదాలను తాకి వార్తల్లోకెక్కి విమర్శల పాలయ్యారు. తాజాగా తావీజ్ మహిమతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని హెల్త్ డైరక్టర్ గా కొనసాగుతున్న శ్రీనివాస రావు వ్యాఖ్యానించడం.. మూఢ నమ్మకాలను ప్రోత్సహించడమే అవుతుందనే విమర్శలు వస్తున్నాయి.