కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికపై జోరుగా చర్చ జరుగుతోంది. ఖాళీ అయిన నియోజకవర్గానికి ఆరు నెలల్లోపు ఎన్నిక నిర్వహించాలేది రాజ్యాంగ నిబంధన. అదే సమయంలో ఎన్నిక నిర్వహణ అనంతరం పదవి కాలం సంవత్సరంపాటు ఉంటేనే ఉప ఎన్నిక నిర్వహిస్తారని అంటున్నారు. ఈ ఉప ఎన్నిక నిర్వహణ మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహణకు మొగ్గు చూపితే కర్ణాటక ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది.
ఉప ఎన్నిక ద్వారా బీఆర్ఎస్ పై పట్టు సాధించాలని బీజేపీ పట్టుదలగా ఉంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల ద్వారా బీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించిన బీజేపీ… కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరిగితే మరోసారి పట్టు బిగించే అవకాశం ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. పైగా.. అర్బన్ ఏరియాలో బీజేపీకి మొదటి నుంచి బలం ఎక్కువే. ఇటీవల ఆ బలం మరింత ఎక్కువైంది. దీంతో కంటోన్మెంట్ పై ఏమాత్రం అలసత్వం వహించినా సాధారణ ఎన్నికల సమయనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బీఆర్ఎస్ ఆందోళన చెందుతుంది. ఉప ఎన్నిక నిర్వహణపై స్పష్టత లేకపోయినా ఉప ఎన్నిక జరుగుతుందనే స్థాయిలో అక్కడ పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండేలా శ్రేణులకు దిశానిర్దేశం చేయాలని గ్రేటర్ మంత్రులకు కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.
ఎమ్మెల్యే మరణిస్తే అక్కడ వారి కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఇప్పుడు కంటోన్మెంట్ లో సాయన్న కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తారా..? అనే అంశం చర్చగా మారింది. సాయన్నకు ముగ్గురు కుమారులు , ఓ కుమార్తె ఉన్నారు. వారు రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా లేరు. దాంతో.. కంటోన్మెంట్ సీటును గతంలో ఆశించి భంగపడిన క్రిశాంక్ కు ఇస్తారా అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈమేరకు క్రిశాంక్ కూడా ఉప ఎన్నిక కోసం గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకునే యోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యవహారాలను పర్యవేక్షించే క్రిశాంక్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటారు. కేటీఆర్ కు సన్నిహితుడు కూడా కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. పైగా.. ఓయూ విద్యార్ధి నాయకుడిగా క్రిశాంక్ కు పేరుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని బీఆర్ఎస్ అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందని క్రిశాంక్ లెక్కలు వేసుకుంటున్నారని అంటున్నారు. ఉప ఎన్నిక నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వనే లేదు కానీ బీఆర్ఎస్ లో టికెట్ ఆశావహులు మాత్రం అప్పుడే ఎన్నిక కోసం లాబియింగ్ చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read : కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక ఉంటుందా..?