బీఆర్ఎస్ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే ప్రారంభిస్తుండటం చర్చకు దారితీసింది. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి కోల్పోయారని చెప్పేందుకు ఇదో మచ్చుతునక అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చాక కేసీఆర్ చేస్తోన్న రాజకీయాలను ఓ పట్టాన గమనిస్తే ఇది నిజమేననే అనుమానం తప్పకుండా కలుగుతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ జాతీయ తాత్కాలిక కార్యాలయ ప్రారంభోత్సవంతోనే… బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారినట్టేననే రేంజ్ లో ప్రచారం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి వందలమంది ఢిల్లీకి వెళ్ళారు. ఇప్పుడు శాశ్వత భవనం ప్రారంభిస్తుంటే మాత్రం ఆ హడావిడి కనిపించడం లేదు. కేసీఆర్ కూడా ఎదో తప్పదు కాబట్టి వెళ్తున్నట్టు కనిపిస్తున్నారు.
బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి కేసీఆర్ ముందుగానే వెళ్తారని అక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తారని.. జాతీయ మీడియాతో మాట్లాడుతారని బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేశాయి. కానీ ఆయన మాత్రం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం రోజున ఢిల్లీకి వెళ్ళారు. నిజానికి.. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చాక పార్టీ విస్తరణ కోసం కేసీఆర్ మరింత స్పీడ్ పెంచుతారని అంత భావించారు. ఎందుకంటే పార్టీ పేరు మార్చాక ముందే ఆయన పలు రాష్ట్రాల్లో పర్యటించారు. పలువురు జాతీయ నేతలతో భేటీ అయ్యారు. దేశ్ కీ నేత ఇమేజ్ కోసం తెగ ప్రయత్నించారు. కానీ పార్టీ పేరు మార్చాక మాత్రం ఆయన రాజకీయాల్లో మునుపటి దూకుడు కనిపించడం లేదు. ఎవరిని కలవడం లేదు.
పార్టీ పేరును ఈసీ గుర్తించిన వెంటనే ఢిల్లీలో భారీ బహిరంగ సభ పెడుతారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఆ తరువాత ఈ విషయమై ప్రశ్నిస్తే పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం రోజున సభ ఉంటుందని ప్రచారం చేసుకున్నారు. బీఆర్ఎస్ అనుకూల మీడియా ఈ రకమైన ప్రచారం చేసింది కానీ, బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం రోజున సభను ఏర్పాటు చేయలేదు. బీఆర్ఎస్ కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సిలు, కార్పోరేషన్ చైర్మన్లు, కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలు వెళ్ళారు తప్పితే సీరియస్ గా పని చేసే బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్ళలేదు.
జాతీయ రాజకీయాల్లో కీలకభూమిక పోషించాలని పట్టుదలగా కనిపించిన కేసీఆర్ ఉత్తరాదిలో పట్టు కోసం సభలు పెట్టాలనున్నారు. అక్కడి నేతలతో మాట్లాడుతున్నారు కానీ ఎవరూ బీఆర్ఎస్ లో చేరేందుకు ముందుకు రావడం లేదు. ఇటీవలి కాలంలో ఒక్క మహారాష్ట్ర మినహా ఏ రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ పార్టీ గురించి కేసీఆర్ సీరియస్ గా ఆలోచించడం లేదు. ఏపీలో స్టీల్ ప్లాంట్ అంశంతో అక్కడ రాజకీయం చేయాలనుకున్నా సెట్ అవ్వలేదు. కర్ణాటకలో జేడీఎస్ తో దోస్తీ చేసి కర్ణాటకలో ప్రవేశం పొందాలనుకున్నారు కానీ బీఆర్ఎస్ చీఫ్ ఆశలేవి ఫలించలేదు.
మొత్తానికి బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలు ట్రాక్ తప్పాయన్న అభిప్రాయాలూ తాజాగా బలపడుతున్నాయి.