ప్రేమించిన అమ్మాయి కోసం మిత్రుడిని హత్య చేసిన హరిహరకృష్ణను పోలీసులు విచారిస్తోన్న సంగతి తెలిసిందే. నవీన్ ను ఎందుకు అత్యంత పాశవికంగా హత్య చేయాలనుకున్నాడు..? ఈ హత్యకు ఎవరైనా సహకారం అందించారా.? ఈ హత్యతో నవీన్, హరి స్నేహితురాలికి ఏమైనా సంబంధం ఉందా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఈ హత్య కేసులో యువతి ప్రమేయంపై అనుమానాలు కూడా రావడంతో ఆమెను కూడా విచారించేందుకు పోలీసులు అనుమతి తీసుకున్నారు. కానీ ఈ విచారణకు యువతి అసలు సహకరించలేదు. కౌన్సిలింగ్ ఇచ్చిన కూడా ఆమె తీరు మారలేదు. చివరికి ఆ హత్య కేసుతో యువతికి ఎలాంటి సంబంధం లేదని రాచకొండ సీపీ ప్రకటించారు. ప్రస్తుతం పొలిసు కస్టడీలోనున్న హరిని విచారించగా అతడి మాటలు విని పోలీసులే షాక్ అయ్యారట.
నిజానికి ఈ హత్యకేసులో హరి చెప్పిన సమాధానాలను పోలీసులు అధికారికంగా బయటకు చెప్పింది లేదు. కేసు విచారణలో ఉన్న సమయంలో దర్యాప్తునకు సంబంధించి వివరాలు వెల్లడించకూడదు. కానీ రిమాండులో హరిహర కృష్ణ చెబుతున్న సమాధానాలు ఇలా ఉన్నాయి అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి.
మిత్రుడిని చంపినందుకు హరిహరకృష్ణలో ఏమాత్రం పశ్చాతాపం కనిపించడం లేదట. యూట్యూబ్ లో క్రైం వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పాడట. నేనొక్కడే ఈ హత్య చేశాను. ఈ ఘటనతో ఎవరికీ సంబంధం లేదు. ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించానని చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదంతా ఒకే కానీ…నన్ను మీరేమీ పట్టుకోలేదు. నేనే మీకు లొంగిపోయాను. నాకు చట్టం గురించి తెలుసు. విచారణ తర్వాత మీరు నన్ను జైలుకు పంపాల్సిందే. కోర్టు నాకు యావజ్జీవ శిక్ష వేయదు. నేను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చేస్తాను అంటూ హరిహర కృష్ణ చెప్పిన మాటలకు పోలీసులే ఆశ్చర్యపోతున్నారట.