నీతివంతమైన రాజకీయాలకు కేరాఫ్ గా , ప్రస్తుత రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలిచారు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా సొంతింటిని కూడా నిర్మించుకోలేదు. అసెంబ్లీకి కూడా ఆయన ప్రైవేట్ వాహనాల్లో వెళ్ళేవారు. ప్రజా సేవలోనే తరించారు తప్పితే వ్యక్తిగత ఆస్తులను కూడబెట్టుకోలేదు. అలాంటి నేపథ్యమున్న గుమ్మడి నర్సయ్య కూతురు ఓయూ లా కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొ. గుమ్మడి అనురాధ తన తండ్రి బాటలోనే నడవాలని అనుకుంటున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఖమ్మం జిల్లాలో బలహీనంగా ఉండటంతో బీఆర్ఎస్ గెలుపు గుర్రాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా గుమ్మడి నర్సయ్య కూతురు గుమ్మడి అనురాధను ఇల్లందు నుంచి పోటీ చేయిస్తే గెలుపు ఈజీ అవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున ఇల్లందు నుంచి గెలిచిన హరిప్రియ అధికార బీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించి కొత్త వారికీ అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు.
ఇల్లందు నుంచి పోటీ చేసేందుకు జడ్పీ చైర్మన్ బిందు, మహబూబాబాద్ ఎంపీ కవిత ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. జిల్లా నేతలు మాత్రం గుమ్మడి అనురాధ పేరును పార్టీ పెద్దలకు సూచించినట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పై పొంగులేటి ప్రతీకారంతో రగిలిపోతున్నారు. దాంతో ఆయనకు చెక్ పెట్టేందుకు ఖమ్మం జిల్లాపై బీఆర్ఎస్ పెద్దలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఖమ్మం జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాలనుకుంటున్నారు.
అందుకే జనబలం మెండుగా ఉన్న గుమ్మడి నర్సయ్య కూతురు అనురాధను బరిలో నిలపాలని బీఆర్ఎస్ కూడా భావిస్తోంది. అనురాధ రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ జరుగుతుండగానే నియోజకవర్గంలో పలుచోట్ల ఆమె ఫ్లెక్సీలు వెలిశాయి. ఇల్లందు మీ నాయకత్వాన్ని కోరుకుంటుంది అక్క అంటూ ఆ ఫ్లెక్సీల్లో రాసుకొచ్చారు. అయితే , అనురాధను రాజకీయ ఎంట్రీపై ఆమె తండ్రి సుముఖంగా లేరని టాక్ నడుస్తోంది.
Also Read : పవన్ కళ్యాణ్ అలాంటివాడా..? రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు