తెలంగాణ సచివాలయంలోని ఆలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసైని ఆహ్వానించి ఆమెకు అతిథి మర్యాదలు చేయడంతో ఇక కేసీఆర్ , గవర్నర్ ల మధ్య శషభిషలు తొలగిపోయినట్లేనని అనుకుంటున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సి అభ్యర్థుల పేర్లను ఆమోదించకుండా గవర్నర్ తాజాగా తిరస్కరించారు. రాజకీయ నేతల పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సి అభ్యర్థులుగా ప్రతిపాదించవద్దని ప్రగతి భవన్ కు గవర్నర్ లేఖ రాశారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ప్రతిపాదిస్తూ గవర్నర్ ఆమోదం కోసం తెలంగాణ కాబినెట్ పంపింది. వీటిపై తాజాగా గవర్నర్ స్పందిస్తూ… సామజిక కార్యక్రమాల్లో వీరు యాక్టివ్ గా ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లేవని.. ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగలేదని కేసీఆర్ కు గవర్నర్ రాసిన లేఖలో పేర్కొన్నారు. అర్హులను సిఫార్సు చేస్తే ఆమోదిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో సామజిక కార్యక్రమాలు చేపడుతున్న వారు చాలామంది ఉన్నారని.. వారి ని పరిగణనలోకి తీసుకోలేదని గవర్నర్ పేర్కొన్నారు.
దాసోజు శ్రవణ్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారని గవర్నర్ గుర్తు చేశారు. ఏ రంగంలో ఆయన సేవ చేశారో అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు పంపలేదని తెలిపారు.
Also Read : కేసీఆర్ లో ఇంత మార్పు ఏంటి – ఇదా అసలు కథా..?