ఫామ్ హౌసులు ఉండటం కాదు. అందరికీ నివసించేందుకు ఇల్లు ఉండేలా చొరవ చూపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ తమిళిసై చురకలటించారు. అభివృద్ధి అంటే కొత్త బిల్డింగులు కట్టడం కాదని.. దేశాన్ని నిర్మించడమని సెక్రటేరియట్ నిర్మాణంనుద్దేశించి సెటైర్లు వేశారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శలు చేశారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక.. గవర్నర్ విషయంలోనూ తగ్గేది లేదంటూ ప్రభుత్వం కూడా ఎదురుదాడి చేసింది. మంత్రులు , ఎమ్మెల్యేలు , బీఆర్ఎస్ నేతలు గవర్నర్ వ్యాఖ్యలను ఖండిస్తూ రెచ్చిపోయారు.
గవర్నర్ ప్రసంగం ఏర్పాటు చేయకుండా బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని సర్కార్ డిసైడ్ అయింది. ఇందుకోసం నోటిఫికేషన్ ఇచ్చింది. బడ్జెట్ ఫైల్ ఆమోదం కోసం గవర్నర్ కు పంపితే.. సంతకం పెట్టకుండా పెండింగ్ లో పెట్టారు తమిళిసై. సర్కార్ కు సీన్ అర్థమై హైకోర్టుకు వెళ్ళింది. అక్కడ వాదనలో తేడాలు వచ్చేశాయి. దాంతో చేసేదేం లేక గవర్నర్ ప్రసంగం ఏర్పాటు చేస్తామని హైకోర్టుకు హామీ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తరువాత కూడా గవర్నర్ తన పంథాను మార్చుకోలేదు. తనకు ఇచ్చిన స్పీచ్ లో మార్పులు చేయాలని శాసన సభ వ్యవహారాల మంత్రిని ఆదేశించింది.
బడ్జెట్ సమావేశాలో భాగంగా తన ప్రసంగంలో ప్రభుత్వంపై కాస్తైన విమర్శలు చేస్తారనుకున్నారు. కాని ఆమె మాత్రం తెలంగాణ సర్కార్ పై ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని తమిళిసై పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతతో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిని చూసి దేశమంతా ఆశ్చర్యపోతోందని తెలిపారు. నిన్నటివరకు సర్కార్ తో డీ అంటే డీ అనేలా వ్యవహరించిన తమిళిసై సడెన్ గా కేసీఆర్ సర్కార్ పై ప్రశంసల జల్లు కురిపించడం అందర్నీ అవాక్కయ్యేలా చేసింది.
నిజానికి.. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించేలానే ఉంటుంది. కానీ గతంలో మాత్రం రిపబ్లిక్ డే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్పీచ్ కాకుండా సొంత స్పీచ్ చదివి కేసీఆర్ సర్కార్ ను ఇరుకున పెట్టారు. అప్పటి నుంచి ప్రగతి భవన్ , రాజ్ భవన్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇక ప్రోటోకాల్ విషయంలో తనపై వివక్ష చూపిస్తుండటంతో తమిళిసై రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ద చర్యలను ఉటంకిస్తూ తాజా బడ్జెట్ ప్రసంగంలో ఏమైనా సంచలన వ్యాఖ్యలు చేస్తారని అనుకున్నారు కాని ఆమె మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేసీఆర్ సర్కార్ ను ఆకాశానికి ఎత్తేశారు.