తెలంగాణలో లక్షల సంఖ్యలో నిరుద్యోగులు పెట్రోల్ ధరలా పెరుగుతున్నారు. వాళ్ళను తెలంగాణ ఉద్యమంలో చాలా తెలివిగా కేసీఆర్ వాడుకున్నాడు అనడానికి నిరుద్యోగ భృతి అనే దొంగ పథకం ఓ చక్కటి ఉదాహరణ. రోడ్డున పడ్డ నిరుద్యోగులను అందరికంటే ముందుగా ‘నిరుద్యోగ భృతి’ తో ఎమర్జెన్సీ కేసులా ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చాడు. నిరుద్యోగులకు లేని ఆశలు కల్పించాడు. ఆకలి వేసేవాడికి కనీసం పాన్ ఇస్తానని నోరు ఊరించాడు.
గులాబీ కార్ లో వస్తే ఆలస్యం అవుతుందని అంబులెన్సులో సైరన్ చేస్తూ దూసుకొచ్చాడు. ట్రాఫిస్ రూల్స్ పాటించకుండా తెలంగాణ మొత్తం తిరిగాడు. నెలకు 3016 రూపాయలు ఇస్తామని లక్షల సార్లు ప్రమాణం చేశాడు. చావు బతుకుల్లో కొట్టు మిట్టాడుతున్న పట్టభద్రులను అంబులెన్సు లో ఎక్కించి గ్లూకోజ్ నీళ్లు ఎక్కిస్తాని భుజానికి పెద్దమ్మ తల్లి గుడిలో కొన్న కంకణం కట్టుకున్నాడు. డాన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ తలకు కంకణం కట్టుకున్నాడు. మన హీరో అన్న కేసీఆర్ హీరో లాగా కుడి చేతికి కంకణం కట్టుకున్నాడు. అప్పటి నిరుద్యోగుల బలహీనతను అడ్డంగా వాడుకున్నాడు. ఇప్పుడు నిలువునా ముంచాడు.
తెలంగాణ వచ్చాక ఆ పథకాన్ని మార్చురీకి పంపాడు. తర్వాత చంపి బొంద పెట్టిండు. దానికి అయిదోద్దులు, పదోద్దులు చేసి పిండాలు కూడా పెట్టాడు. ముసినదిలో ఆ బొక్కలు కలిపాడు. ‘నిరుద్యోగ భృతి కింద మాకు ఇస్తానన్న 3016 రూపాలు క్కడ సారూ? నీ బాంచన్ జల్దీ ఇయ్యవే’ అని పేద నిరుద్యోగులు జోలె పట్టేలా చేసిండు.
ఎమర్జెన్సీ వార్డులు కడుతున్నామని కొన్నేళ్లు మాట తప్పిండు. డాక్టర్లు రాబోతున్నారని మరి కొన్నాళ్లు మాటతప్పాడు. నిరుద్యోగులు కన్నెర్ర చేసేసరికి గత ఏడాది మొక్కుబడిగా కొంత బడ్జెట్ కేటాయించాడు. తీరా చుస్తే ఆ డబ్బును ఇతర పనులకు దారి మళ్లించాడు.
తీరా ఈ ఏడాది బడ్జెట్ లోనైనా కేటాయిస్తాడా అని దింపుడుకాళ్ళ ఆశతో నిరుద్యోగులు ఉన్నారు. ఎప్పటిలా మరో కుంటిసాకు చెప్పి కుంటుకుంటూ శాసన సభనుంచి పారిపోయిండు. ”మా నిరుద్యోగ భృతి ఎమర్జెన్సీ అంబులెన్సు ఏది దొరా?” అని నిరుద్యోగులు పొరపాటున అడగకండి. ”మీ అంబులెన్సు ను ‘కల్యాణ లక్ష్మీ ‘ పెళ్లి బారాత్ కి పంపిన. పెళ్లి కొడుకుని, పెళ్ళి కూతురిని అంబులెన్సు లో శోభనం గదికి పంపిన. వాళ్ళు ఎమర్జెన్సీ లో పిల్లలను కంటే నాకు అర్జెంట్ గా ఓట్లు పడతాయి. పని పాటా లేని మీకెందుకయ్యా అంబులెన్సు – నాకు అర్థం కాకా అడుగుతున్నా” అని తన మానరిజమ్ తో కేసీఆర్ చెప్పవచ్చు. ఎప్పటిలాగే కామైపొండి. మీకు టైం వస్తుంది. మీ ఓటు తో ఈ మోసానికి జవాబు చెప్పండి.