ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇప్పటికే పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేస్తోన్న ప్రభుత్వం తాజాగా మరో రెండు శాఖలో నియామకాలు చేపట్టేందుకు నిర్ణయించింది.
విద్య, వ్యవసాయ శాఖల్లోని ఖాళీలను గుర్తించిన ప్రభుత్వం వీటిని భర్తీ చేసేందుకు టీఎస్ పీఎస్సీ రెడీ అయింది. ఈ రెండు శాఖలో ఖాళీలుగానున్న 276పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కల్గిన అభ్యర్థులు జనవరి 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
సాంకేతిక విద్యాశాఖలో 37 పీడీ పోస్టులు, ఇంటర్ విద్యాశాఖలో 91 పీడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టుల వివరాలు, అర్హతలు తదితర వివరాలను టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ లో పొందుపరిచారు. అర్హత కలిగిన వారు వచ్చే నెల 6 వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు(మల్టి జోన్-1 లో 100, మల్టి జోన్-2 లో 48 ఖాళీలు) భర్తీ చేపట్టినట్లు వివరించారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 10 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. జనవరి 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్ పీఎస్సీ సెక్రెటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.