బీఆర్ఎస్ విస్తరణపై ఫోకస్ చేసిన కేసీఆర్ కీలక నేతలను పార్టీలో చేర్చుకునేలా ప్రణాళికబద్దంగా సాగుతున్నారు. ఇందుకోసం తనవంతు ప్రయత్నం చేస్తూనే పార్టీ నేతల ద్వారా కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మహారాష్ట్ర నాందేడ్ లో నిర్వహించనున్న సభలో భారీగా నేతలను చేర్చుకునేలా ఇప్పటికే ఆ పార్టీ నేతలు అక్కడి నేతలతో సమావేశం అవుతున్నారు. చిన్న , చితక లీడర్లతో సహా బడా నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏవేవో ఆఫర్లు ఇచ్చి నేతలను ఆకర్షిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీపై కూడా బీఆర్ఎస్ దృష్టి సారించింది. నాందేడ్ సభ తరువాత విజయవాడలో సభ నిర్వహించాలని భావిస్తోంది. ఈలోపే మరికొంతమంది నేతలను పార్టీలో చేరేలా ఒప్పించాలని ఆ పార్టీ నేతలు ట్రై చేస్తున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందతో మంతనాలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసీఆర్ కు గంటాకు మధ్య వివేకానంద మధ్యవర్తిత్వం వహిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
2019అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన గంటా శ్రీనివాస్ రావు..పార్టీ అధికారం కోల్పోవడంతో నిరాశకు గురయ్యారు. పార్టీ కార్యక్రమాలకు సైతం ఆయన దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఇటీవల లోకేష్ పాదయాత్ర ప్రారంభించక ముందు ఆయనతో భేటీ అయి..ఇక పార్టీలో యాక్టివ్ అవ్వనున్నట్లు ప్రకటించారు. కానీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గంటా ప్రకటనపై ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యారు. దీంతో మనసు నొచ్చుకున్న గంటా నారా లోకేష్ పాదయాత్రలో ఎక్కడ కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఆయనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది. ఈ భేటీ వివరాలు పూర్తిగా బయటకు రాకున్నా..ఈ సమావేశంలో గంటాను వివేక్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించే ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు కూడా బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ లోకి వస్తే రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది.
Also Read : ఈటలతో కేటీఆర్ మాటామంతి – బీఆర్ఎస్ లోకి బీజేపీ ఎమ్మెల్యే..?