ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పట్టు బిగుస్తోంది. టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలతో మెతుకుసీమ వాసులు మళ్ళీ హస్తం వైపు ఆకర్షితులు అవుతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ బాస్ గా చార్జ్ తీసుకున్నాక కేసీఆర్ సొంత జిల్లా కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకురావడంలో సక్సెస్ అవుతారా అని రాజకీయ వర్గాలు సైతం ఆసక్తిగా గమనించాయి. ఈ క్రమంలోనే మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పునర్ వైభవాన్ని పొందేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ బలోపేతానికి మెదక్ నుంచే పునాది పడాలని గజ్వేల్ లో జరిగిన దళిత , గిరిజన ఆదివాసీ దండోరా సభలో ప్రకటించిన రేవంత్.. అన్నట్టుగానే తన వర్క్ షురూ చేసినట్టుగా కనిపిస్తోంది.
ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ నేతలు నిత్యం ప్రజా క్షేత్రంలోనే ఉంటున్నారు. ప్రధానంగా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్ కాలికి బలపం కట్టుకున్నట్టుగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలను అన్నింటిని చుట్టేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ , నిరుద్యోగం , నిరుద్యోగ భ్రుతి, మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల అంశం వంటి కేసీఆర్ ఫెయిల్యూర్స్ ను జనాలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఉద్యమ ఆకాంక్షలను విస్మరించిన కేసీఆర్ ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో ఆయన కొంతమేరకు సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది. పీకే నిర్వహించిన సర్వేలో ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ బలహీన పడుతుందని, కాంగ్రెస్ మరింత పుంజుకుంటుందని నివేదించినట్టుగా గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ ను వీడి ఆలేరు నుంచి కేసీఆర్ పోటీ చేస్తారనే కథనాల సారాంశమనే అభిప్రాయాలూ వినిపించాయి.
అయితే… మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ గానున్న గాలి అనిల్ కుమార్ గ్రాఫ్ పెరుగుతోన్న నేపథ్యంలో ఆయన వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానంనుంచి పోటీ చేస్తారా..? లేక లోక్ సభ స్థానం నుంచే బరిలోకి దిగుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న గాలి అనిల్ కుమార్… క్యాడర్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటారన్న వాదనలు ఉన్నాయి.దాంతో పార్టీని గతంలో వీడిన వారు సైతం గాలి నాయకత్వానికి మెచ్చి తిరిగి పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఆయన గ్రాఫ్ అమాంతం పెరుగుతుండటంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడకేనని భావించి సమయం చూసుకొని గోడ దూకునేందుకు పలువురు నాయకులు రెడీ అవుతున్నట్టుగా సమాచారం.