మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపై మరోసారి చర్చ జరుగుతోంది. తాజాగా అభ్యర్థులను మార్చి మహిళలకు కొన్నిచోట్ల బీఆర్ఎస్ అవకాశం ఇవ్వడం అనుమానమే. ఎందుకంటే ఈ బిల్లు పాసైనా మహిళా రిజర్వేషన్ వెంటనే అమల్లోకి రావడం కష్టమే. అయినప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించడంతో అన్ని పార్టీలు మహిళలకు ఈ ఎన్నికల నుంచే గణనీయమైన సీట్లను కేటాయించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పెండింగ్ లో ఉంచిన నర్సాపూర్ , గోషామహల్, నాంపల్లి, జనగామ నియోజకవర్గాల్లో రెండు స్థానాలను మహిళలకు అవకాశం ఇవ్వాలనుకుంటోంది.
తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించడం, ఈ క్రెడిట్ పొందేందుకు కవిత ఆరాట పడుతుంది. దీంతో బీఆర్ఎస్ పెండింగ్ లో ఉంచిన నాలుగు స్థానాల్లో కనీసం రెండు స్థానాల్లో అయిన మహిళలకు టికెట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ బాస్ ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డిని బరిలో నిలిపితే బలమైన అభ్యర్థి కావడంతోపాటు అవకాశం ఉన్న చోట మహిళకు ఛాన్స్ ఇచ్చామనే సంకేతం ఇచ్చినట్లు అవుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. పైగా.. బీఆర్ఎస్ మహిళలకు అన్యాయం చేసిందన్న అపవాదును కొంతమేరైన తుడిచివేసుకున్నట్లు అవుతుందన్న అభిప్రాయాలు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. కేటీఆర్ , కవితలు సైతం సునీతా వైపే మొగ్గు చూపుతుండగా హరీష్ ఒక్కరే మదన్ రెడ్డిని రెఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పుణ్యమా అని సునీతా లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వానికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ నుంచి సునీతా లక్ష్మారెడ్డిని బరిలో నిలిపితే కాంగ్రెస్ నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ ను బరిలో నిలపనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని కారు పార్టీపై బీసీలు ఆగ్రహంగా ఉన్నారు. దాంతో సునీతపై బీసీ సామజిక వర్గానికి చెందిన గాలి అనిల్ ను రంగంలోకి దించితే కాంగ్రెస్ కు కలిసి వస్తుందని అనుకుంటున్నారు. మరోవైపు…ఇటీవలి కాంగ్రెస్ విజయభేరి సభ బ్రాండింగ్, పబ్లిసిటీ కో- చైర్మన్ గా గాలి అనిల్ ఆ సభను సక్సెస్ చేయడంతో ఏఐసీసీ స్థాయి నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు ఆయన్ను నేతలు అభినందించారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ..విధేయుడిగా కొనసాగుతుండటంతో గాలి అనిల్ అభ్యర్థిత్వం ఖరారు అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆవుల నర్సారెడ్డి అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరిగినా..అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని గాలి అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేసినట్లు సమాచారం.
Also Read : మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం – తెలంగాణలో ఈ స్థానాలు మహిళలకే..!!