గజ్వేల్ బీజేపీ టికెట్ కు ఈటల రాజేందర్ భార్య జమున దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీలో ఒక కుటుంబం నుంచి ఒకరికే టికెట్ అనే విధానం కొనసాగుతోంది. ఈ విధానం కొనసాగుతుండటంతోనే కుటుంబ రాజకీయాలంటూ బీఆర్ఎస్ , కాంగ్రెస్ లపై ఎదురుదాడి చేస్తుంటుంది బీజేపీ. ఇప్పుడు ఈటల హుజురాబాద్ నుంచి దరఖాస్తు చేసుకోగా ఆయన భార్య గజ్వేల్ టికెట్ కోసం దరఖాస్తు సమర్పించడంతో ….బీజేపీ తెలంగాణ శాఖపై కూడా విమర్శలు వచ్చేందుకు ఈ పరిణామం అవకాశం కల్పించేదిలా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
గజ్వేల్ లో కేసీఆర్ పై తాను పోటీ చేస్తానని బీజేపీలో చేరిన నాటి నుంచే ఈటల ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పుడేమో ఆయన భార్యను గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీకి దించాలని చూస్తున్నారు. గజ్వేల్ బీజేపీ టికెట్ ఎవరికీ దక్కుతుందనే అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. కానీ ఈటల జమున దరఖాస్తు చేసుకోవడంతో ఆమె కేసీఆర్ పై పోటీలో ఉంటారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.
కేసీఆర్ పై ఈటల జమున పోటీ చేయడమంటే ఈటల రాజేందర్ పోటీ చేయడమే. కానీ కుటుంబ , వారసత్వ రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ కుటుంబంలో ఇద్దరికీ టికెట్ ఇస్తుందా..? అనేది ప్రశ్న. జాతీయ స్థాయిలో కొంతమందికి టికెట్లు ఇచ్చింది కానీ ఇప్పుడిప్పుడే పార్టీలో చేరిన ఈటల కుటుంబంలో ఇద్దరికీ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం ఆలోచించే అవకాశం ఉంది. కానీ ఈటల ఏ ధీమాతో జమునతో టికెట్ కోసం దరఖాస్తు చేయించారనేది బిగ్ డిబేట్ గా మారింది.
అయితే…ఇదంతా బీజేపీ అధినాయకత్వం ప్లాన్ లో భాగంగానే జరుగుతుందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read : కేసీఆర్ పై ఈటల..కేటీఆర్ పై బండి.. హరీష్ పై బూర నర్సయ్యలు పోటీ… బీజేపీ జాబితా, స్ట్రాటజీ ఇదేనా..?