తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజా గాయకుడు గద్దర్. నియంతలకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన రాజకీయ హామీలను విస్మరించారని మండిపడ్డారు. అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ కేసీఆర్ అని విమర్శించారు.
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం గద్దర్ మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని డిమాండ్ చేస్తోన్న కేసీఆర్.. అసలెందుకు రాజ్యాంగాన్ని మార్చాలో చెప్పాలన్నారు. పార్లమెంట్ కు అంబేడ్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ తన పార్టీ జాతీయ ఎజెండాలో చేర్చాలని డిమాండ్ చేశారు.
రాజకీయ నాయకుడు ఎవరైనా ఆర్థిక పరమైన హామీలు ఇస్తారు కాని కేసీఆర్ మాత్రం ఉద్యమ సమయంలో రాజకీయపరమైన హామీలను ఇచ్చారని చెప్పారు గద్దర్. దళితుడ్ని సీఎం చేస్తానని తెలంగాణ దళిత సమాజాన్ని మోసం చేశారని మండిపడ్డారు. దళితులకు ఇస్తానని ప్రామిస్ చేసిన మూడెకరాల భూమి ఇవ్వకుండా దళిత బంధు ఇస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ విధానాలతో తెలంగాణ సమాజం మోసపోతుందని, ఇకనైనా మేల్కొవాలంటూ వ్యాఖ్యానించారు.