కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు ఇతర పార్టీలోకి వెళ్లే నేతలే ఉండేవారు కానీ కాంగ్రెస్ లోకి కొత్తగా ఎవరూ చేరేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పార్టీలో చేరేందుకు చాలామంది నేతలు ఎదురుచూస్తున్నారు. టికెట్ పై హామీ ఇస్తే కాంగ్రెస్ లోకి వస్తామని కబురు పంపుతున్నారు. మరికొంతమంది నేతలు టికెట్ పై హామీ ఇవ్వకపోయినా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ కు మునుపటి వైభవం వస్తున్నట్లే కనిపిస్తోంది.
కాంగ్రెస్ లో చేరేందుకు ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నారు. పట్నం మహేందర్ రెడ్డితోపాటు కూచకుళ్ళ దామోదర్ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరే దిశగా అడుగులు వేస్తున్నారు. పొంగులేటి, జూపల్లి కూడా కాంగ్రెస్ లో చేరడం లాంచనమే. బీజేపీ నుంచి మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకొస్తానని ఇటీవల ప్రియాంక గాంధీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయిన సమయంలో చెప్పినట్లు సమాచారం. వీళ్ళంతా కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ పుంజుకుంటుంది. ఎన్నికల వేళ ఈ పరిణామం కాంగ్రెస్ కు కలిసి వచ్చేది.
కాంగ్రెస్ లో చేరేందుకు చాలామంది నేతలు ఆసక్తిగా ఉండటంతో చేరికల కోసం మల్లురవి నేతృత్వంలో ఓ కమిటీని నియమించినట్లు తెలుస్తోంది. దాంతో మల్లు రవిని చాలామంది నేతలు సంప్రదిస్తున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ వచ్చే నెల తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో చాలామంది నేతలు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఒకప్పుడు పార్టీని వీడే నేతలను బ్రతిమాలే స్థితి నుంచి మీ పార్టీలో చేరుతాం మహాప్రభో అని నేతలు ఆసక్తి చూపిస్తున్నారంటే కాంగ్రెస్ ఎంత బలీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.
Also Read : ఎన్నికల సర్వే రిపోర్ట్ విడుదల చేసిన రేవంత్ – కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఎన్ని సీట్లంటే..?