హైదరాబాద్ లోని ఆసుపత్రుల కంటే కూడా నెక్కొండ మండల కేంద్రంలోని ఓ ఆసుపత్రీ బాగా ఫేమస్. అయితే ఇదేదో అత్యుత్తమ వైద్యం అందించడంలో అనుకునేరు. లింగ నిర్ధారణ పరీక్ష చేసి ఆడపిల్ల అని తేలితే భ్రుణ హత్యలు చేయడంతోపాటు గర్భం దాల్చిన అవివాహితులకు అబార్షన్ చేయడంలో ఆ ఆసుపత్రి ఫేమస్ అయింది. ఈ వ్యవహారమంతా గుట్టు చప్పుడు కాకుండా అత్యంత రహస్యంగా సాగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నెక్కొండ గ్రామ పంచాయితీ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం ఈ కొత్త బిజినెస్ ప్రారంభించింది. మొదటి సంతానంగా ఆడపిల్ల కల్గిన వివాహితులు, గర్భం దాల్చిన యువతులను ఆసుపత్రి యాజమాన్యం టార్గెట్ చేయడం అలవాటుగా మార్చుకుంది. లింగనిర్ధారణతోపాటు, అబార్షన్స్ కోసం ఆసుపత్రికొచ్చే వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అడిగినంత సొమ్ము దండుకోవచ్చునని నిబంధనలను బ్రేక్ చేసి అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ ఆడ పిల్ల అని తెలియగానే భ్రుణహత్యలు చేస్తూ పసిపిండాలను కడుపులోనే కరిగించేస్తున్నారు. ఇది నేరమని తెలిసినా ఏమాత్రం పట్టించుకోకుండా పాపాలను మూటగట్టుకుంటున్నారు.
గ్రామాల్లోని ఆర్ఎంపీ, పీఎంపీలతో సంబంధాలు కొనసాగిస్తూ వారికీ కమిషన్లు ఇస్తూ ఈ అబార్షన్ తంతును కొనసాగిస్తున్నారు. ఈ విషయం గర్భిణీ మహిళల ద్వారా ఆ నోట, ఈ నోట పాకి హైదరబాద్ కూడా చేరింది. దాంతో నగరం నుంఛి కూడా నెక్కొండకు అబార్షన్ కోసం, అబార్షన్ కోసం వెళ్తున్నారంటే ఆ ఆసుపత్రి ఎంత సీక్రెట్ గా ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తు ఫేమస్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. గతంలో ఈ ఆసుపత్రి అనేక వివాదాలకు కేంద్రబిందువుగా నిలవడంతో సీజ్ చేశారు. ఆ తరువాత మళ్ళీ పునఃప్రారంభమైనప్పటికీ ఆసుపత్రి యాజమాన్యంలో ఎలాంటి మార్పు లేనట్టు ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయి.
లింగ నిర్ధారణ కోసం ఆసుపత్రికి వచ్చేవారి నుంచి 10వేలు, అబార్షన్ కోసమైతే 30వేల ఫీజ్ పిండుకున్నట్లు తెలుస్తోంది. డైలీ ఐదారు అబార్షన్లు చేస్తూ 2 లక్షల వరకు సంపాధిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికులు వైద్యారోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. అంటే ఈ వ్యవహారం వెనక ప్రజా ప్రతినిధుల హస్తం కూడా ఉండి ఉండొచ్చునన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి.