బీఆర్ఎస్ ను విస్తరించేందుకు కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరాదిన పార్టీని విస్తరించేందుకు శతవిధాలా ప్రయత్నించిన పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దాంతో నార్త్ తరువాత చూద్దాంలే అనుకున్నారో ఏమో, ఇప్పుడు సౌత్ పై కేసీఆర్ ఫోకస్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ను విస్తరించేందుకు అనుకూలమైన రాష్ట్రాల ఎంపికలో ఏపీ ఫస్ట్ ప్లేసులో ఉంది. అందుకే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను రంగంలోకి దింపారు. ఆయనకున్న బంధుత్వాలు ఏపీలో పార్టీ ఎదుగుదలకు కలిసి వస్తాయని కేసీఆర్ భావిస్తూ ఉండొచ్చు. అయితే, ఏపీ సమస్యల పట్ల కేసీఆర్ స్టాండ్ ను బట్టి బీఆర్ఎస్ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఏపీలో ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ మూడు రాజధానుల అంశం. ఈ అంశంపై కేసీఆర్ స్పష్టతను ఇవ్వాల్సి ఉంది. గతంలో జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటిస్తే కేసీఆర్ అందుకు జై కొట్టారు. ఇప్పుడు టీఆర్ఎస్ జాతీయ స్థాయి పార్టీగా మారాలనుకుంటుంది కాబట్టి , గతంలో తీసుకున్న నిర్ణయానికే కేసీఆర్ కట్టుబడుతారా..? నిర్ణయాన్ని మార్చుకుంటారా అన్నది ఆ పార్టీకి కీలకం కానుంది. ఏపీలో వైసీపీ మినహా మిగతా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని పట్టుబడుతున్నాయి. దాంతో కేసీఆర్ వైసీపీ వైపేఉంటారా..? విశాల రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం మార్చుకుంటారా అన్నది తేల్చుకుంటే.. ఏపీలో పార్టీ వుస్తరణకు లైన్ క్లియర్ అయినట్లే.
ప్రస్తుతం కేసీఆర్ హస్తినలో ఉన్నారు. ఇంకొన్ని రోజులు అక్కడే ఉండే జాతీయ స్థాయి రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్రపై పలువురితో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ధర్నా చేసేందుకు హస్తినకు వెళ్ళారు. శనివారం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. ఈ ధర్నాకు కేసీఆర్ హాజరై మద్దతు పలికితే.. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి పాస్ లభించినట్లే.