పెండింగ్ లో ఉంచిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈమేరకు అభ్యర్థులకు కేటీఆర్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని అభ్యర్థులకు కేటీఆర్ దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. గత నెల 21న 119 అసెంబ్లీ స్థానాల్లో 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు సీఎం కేసీఆర్. నాలుగు స్థానాలను మాత్రమే పెండింగ్ పెట్టారు. జనగామ, నాంపల్లి, నర్సాపూర్ , గోషామహల్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. తాజాగా ఈ నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసి వారిని క్షేత్రస్థాయిలో పని చేసుకోవాలని సూచించినట్లు తెలిస్తోంది.
జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సాపూర్ నుంచి మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి, గోషామహల్ నుంచి నంద కిషోర్ వ్యాస్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. నాంపల్లి అభ్యర్థిత్వం విషయంలో కేసీఆర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎంఐఏంతో ఫ్రెండ్లీ పోటీ ఉంటుందని స్పష్టం చేసిన కేసీఆర్.. అభ్యర్థి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నారు. మల్కాజిగిరి అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావును ప్రకటించినా ఆయన కుమారుడికి బీఆర్ఎస్ మెదక్ టికెట్ ఇవ్వకపోవడంతో మైనంపల్లి కాంగ్రెస్ లో చేరారు. దాంతో ఆ నియోజకవర్గం నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
తొలి జాబితాలో అభ్యర్థుల మార్పు : ఇప్పటికే ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో కూడా మార్పులు చేయనున్నారు. పటాన్ చెరు నియోజకవర్గం నుంచి గూడెం మహిపాల్ రెడ్డికి మరోసారి టికెట్ కేటాయించారు. అక్కడి నుంచి నీలం మధు టికెట్ ఆశించి భంగపడ్డారు. బీసీ సామజిక వర్గానికి చెందిన నీలం మధు కోసం ముదిరాజ్ లు పెద్దఎత్తున ర్యాలీలు చేపడుతున్నారు. 60లక్షల జనాభా ఉన్న ముదిరాజ్ లకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ సామజిక వర్గం వారు బీఆర్ఎస్ పై ఆగ్రహంగా ఉన్నారు. ముదిరాజ్ ల మద్దతు నీలం మధుకు పెరుగుతుండటంతో బీఆర్ఎస్ పై ఒత్తిళ్ళు కూడా పెరుగుతున్నాయి. దాంతో అక్కడ మధుకు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అంబర్ పేట్ లో కూడా అభ్యర్థిని మార్చే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో అక్కడ బీజేపీ సీనియర్ నేత, వెంకట్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. వెంకట్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయనకు టికెట్ పై హామీ ఇచ్చే బీఆర్ఎస్ లో చేర్చుకున్నారన్న టాక్ ఉంది. అంబర్ పేట్ లో ఈసారి కిషన్ రెడ్డిని ఓడించడం కాలేరుతో సాధ్యం కాదని అంచనా వేసే ఆయన అనుచరుడిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. దీంతో అంబర్ పేట్ లో వెంకటేష్ స్థానంలో వెంకట్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
Also Read : వెనకబడుతోన్న కేసీఆర్ – జెట్ స్పీడ్ తో రేవంత్..!!