దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై పెద్ద చర్చే నడుస్తోంది. ఈ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సమర్ధించడం పట్ల భిన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై సమీక్ష జరగాల్సిన అవసరముందని బీసీ సంఘాలు కోరుతున్నాయి.
దేశంలో అగ్రవర్ణాల జనాభా ఏడు నుంచి ఎనిమిది శాతం ఉంది. అయినప్పటికీ వారికీ, జనాభాను మించి రెట్టింపు రిజర్వేషన్ల సౌకర్యం తీసుకురావడంపై పెదవి విరుస్తున్నారు. ఆర్థిక బలహీనత ప్రాతిపదికన ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చినప్పుడు అన్ని సామజిక వర్గాల్లో వెనకబాటుతనానికి గురైన వర్గాలకు ఈ రిజర్వేషన్లు పొందే వెసులుబాటు కల్పించాలి. అప్పుడే ఈ రిజర్వేషన్ల లక్ష్యానికి సార్ధకత చేకూరుతుంది. కాని అసలు లక్ష్యాన్ని వదిలేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చట్టబద్దతను సవాల్ చేసేలా సుప్రీం తీరు ఉందనేది బీసీ/SC/ST మేధావులు ఆవేదన.
గతంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిటీ సిఫార్స్ చేసిన సమయంలో, ఎన్టీఆర్ హయంలో నియమించిన మురళీధర్ రావు కమిటీ కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్స్ చేస్తే రిజర్వేషన్లు 50శాతానికి మించడానికి వీల్లేదంటూ న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. 56శాతం ఉన్న బీసీలకు 44శాతం రిజర్వేషన్లు అందాలని నివేదిస్తే భూగోళం ఎదో బద్దలు అవుతుందని వ్యాఖ్యలు చేశాయి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ఫలితంగా రిజర్వేషన్లు 50శాతం దాటుతున్నప్పటికీ.. ఈ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు సమర్ధించడం ఎలా సమర్ధనీయం అవుతుందన్నది మౌలిక ప్రశ్న.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందే వారిలోనే 50శాతానికి పైగా భూస్వామ్యులు ఉన్నారు. అయినప్పటికీ ఐదు శాతం ఉన్న ఈ అగ్రవర్ణ పేదలకు జనాభాను మించి 10శాతం రిజర్వేషన్లు కల్పించడమంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అసలు లక్ష్యం దెబ్బతినడమే. ఆర్థిక బలహీనులను ఆర్థికంగా నిలదోక్కునేలా చేసేందుకే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అయితే, ఆర్థికంగా చితికిపోయిన సామజిక వర్గాలకు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించాలి. కాని కేవలం 5% ఉన్న అగ్రవర్ణాల్లో మాత్రమే పేదలు ఉన్నట్టు వారికీ పదిశాతం రిజర్వేషన్ లను కల్పించడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది.
వాస్తవానికి అంబేడ్కర్ వలన ఎస్సీ, ఎస్టీలు ఎప్పటి నుంచో రిజర్వేషన్లు పొందుతున్నారు. బీసీలకు మాత్రం మండల్ కమిషన్ సిఫార్స్ ల అనంతరం రిజర్వేషన్లు దక్కాయి. దాంతో బీసీలు ఇంకా ఆర్థికంగా , రాజకీయంగా వెనకబడి ఉన్నారు. బీసీలలోని పేదలకు ఇదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో వాటా పంచితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పై ఎలాంటి వ్యతిరేకత ఉండదు..అలాగే రిజర్వేషన్ల అసలు లక్ష్యానికి ఊతమిచ్చిన వాళ్ళు అవుతారు. బీసీ ప్రధానిగా కొనసాగుతున్నారని జబ్బలు చరుచుకొని మాట్లాడే బీజేపీ బీసీ నాయకులు జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ పొందే అవకాశాన్ని కల్పించాలని ఆ దిశగా కేంద్రాన్ని ఒప్పించగలుగుతారా..? చూడాలి.