తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంటుంది. అధికారంలో ఉన్న వారు బాధ్యతతో మెలగకుండా రాజకీయ ఉద్రిక్తతలకు కారణం అవుతున్నారు. ఏపీలో కనిపించే ఫ్యాక్షన్ పాలిటిక్స్ తెలంగాణలో కూడా ప్రవేశించింది. రాజకీయాల్లో అసహనం పేరుకుపోతున్న దృష్ట్యా ఈ తరహ రాజకీయాలు వెలుగు చూస్తున్నాయి. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో రాజకీయ హత్యలు కూడా జరిగే ప్రమాదం ఉన్నది.
అధికారం చేతుల్లో ఉంటే ఇలాగేనా మాట్లాడేది..!
నిజామాబాద్ ఎంపీ అరవింద్ పట్ల ఎమ్మెల్సీ కవిత వాడిన భాష ప్రయోగం ఏమాత్రం సమంజసంగా లేదు. చెప్పుతో కొడుతానని కవిత మాట్లాడం రాజకీయ విలువలు పూర్తిగా దిగజారిపోయాయని చెప్పేందుకు ఇదో ఉదాహరణ. పట్టుకొని, పట్టుకొని తంతాం అని బాధ్యతయుతమైన పదవిలో కొనసాగుతున్న కవిత మాట్లాడటం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు చేయడం సహజం కాని, తెలంగాణ రాజకీయాలు ఆ స్టేజ్ ను దాటేసినట్లు తెలుస్తోంది.
రాజకీయ ప్రత్యర్ధులపై దాడులు
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజకీయ ప్రత్యర్ధులపై వేధింపులు పెరిగిపోయాయి. బెదిరింపులు కూడా కొనసాగుతున్నాయి. ఎంపీ రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఎంపీ అరవింద్ నివాసంపై దాడికి పాల్పడ్డారు. ఫుల్ హై సెక్యూరిటీ జోన్ లో ఉండే అరవింద్ నివాసంలోకి వందమంది కార్యకర్తలు చొరబడి దాడులు చేశారు. అధికార పార్టీ కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తుంటే పోలీసులు చోద్యం చూశారు కాని అడ్డుకోలేదు. తరువాత మెల్లగా వచ్చి వారిని పట్టుకెళ్లారు దీంతో ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిన దాడిగా తెలుస్తోంది.
విమర్శలకు ప్రతి విమర్శలు సమాధానం కాదా..?
అధికార , విపక్షాలు ఆరోపణలు చేయడం, ప్రత్యారోపణలు చేయడం రాజకీయాల్లో కామన్ గా జరుగుతుంటాయి. కాని అధికార పార్టీ నేతలు విమర్శలంటూ బూతులు తిట్టోచ్చు కాని , విపక్షాలు మాత్రం కౌంటర్ ఎటాక్ చేయడం తప్పు అన్నట్లు పరిస్థితి మారిపోయింది. అధికారంలో కొనసాగుతున్నది మేము.. ఏమైనా అంటాం.. ఏమైనా చేస్తాం.. మధ్యలో అడ్డొస్తే తంతాం.. చెప్పుతో కొడుతామనే వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కల్గించేవే.
నాటి స్పృహ ఏమైంది..?
రాజకీయ సిద్దంతాలు వ్యక్తుల మధ్య అంతరాలుగా ఉండొద్దనేది ప్రజాస్వామ్య స్ఫూర్తి. కాని ఆ స్టేజ్ ను దాటేసిన తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా ఫ్యాక్షన్ పాలిటిక్స్ కు అలవాటు పడుతున్నాయి. అందుకు కావాల్సిన సరంజామాను అధికార పార్టీ రెడీ చేస్తోంది.