ఈ విశాల
ప్రశాంత
ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా!
అని తెలుగు సినిమా తొలి గాయకుడు ఎం.ఎస్. రామారావు ఏడుస్తూ ఈ పాటను పాడి తెలుగు ప్రజలను ఏళ్ల తరబడి ఎడిపిస్తున్నాడు. దీని అర్థం తెలుసా? ఈ విశాలమైన తాజ్ మహల్ సమాధిలో, ప్రశాంతంగా ఉన్న ఆగ్రా శ్మశాన వాటికలో, ఏకాంతంగా ఉన్న నీ సమాధిలో హాయిగా నిదురించు జహాపనా (ముంతాజ్ ముద్దుపేరు) అని శవాన్ని జో కొట్టడం.
తాజమహల్ కట్టిన తర్వాత మొఘల్ చక్రవర్తి షాజహాన్, అతని వంశస్తుల సమాధులు కూడా అక్కడే కట్టాలని ఎవరో సూచించారు. కానీ దానికి చక్రవర్తి షాజహాన్ ఒప్పుకోలేదు. ఆమె చితి నిద్రకు భంగం వాటిల్లుతుందని భయపడ్డారు. ఒంటరిగా , ప్రశాంతంగా ఆమెను శాశ్వతంగా నిదురపోనివ్వాలి అని చెప్పాడు. ఆమె మీద అతనికున్న అమర ప్రేమ అది.
ఆమె అతనికి ప్రేయసి కాదు. భార్య. ఆమెతో తనివితీరా దాంపత్యం చేసి పన్నెండు మంది పిల్లలను కనినా అతని ప్రేమ ఏమాత్రం తరగలేదు. ఆ భార్య చనిపోగానే అందరిలా సమాధి కట్టి చేతులు దులుపుకోలేదు. ఆ సమాధి ప్రపంచం లోనే గొప్పగా ఉండాలని, శాశ్వతంగా నిలిచిపోవాలని తాజ్ మహల్ కట్టించాడు. ఆ సమాధిని తన రాజభవనం లోంచి రోజు చూస్తూ శేష జీవితం గడిపాడు.
అతను చక్రవర్తి కాబట్టి అతని అమర ప్రేమ ప్రపంచానికి తెలిసింది. మరి ఓ పేదవాడి అమర ప్రేమ ప్రపంచానికి ఎలా తెలియాలి? వెంటనే తెలియదు. కానీ ఏదో ఒకరోజు ప్రపంచానికి తెలుస్తుంది. అలా బయటపడిందే ఈ అమర ప్రేమ కావ్యం. బీహార్ కి చెందిన భోలనాథ్, పద్మరాణి ల అమర ప్రేమ కావ్యం. భార్యాభర్తలు. ఎంతో ప్రేమానురాగాలతో కాపురం చేసి కడుపునిండా పిల్లలను కన్నారు.
32 ఏళ్ల ఇందట, అంటే 1990, మే 25నా పద్మరాణి కన్నుమూసింది. ఆమె కోసం తాజ్ మహల్ కట్టించే స్తోమత అతనికి లేకపోవచ్చు. అయితేనేం ఆమె అస్తికలను గంగలో కలపకుండా తన ఇంటి చెట్టుకున్న మామిడి చెట్టుకు కుండలో కట్టి వేలాడదీశాడు. దానిని ప్రేమ కలశంలా రోజు చూస్తూ మురిసిపోయేవాడు. తమ దాంపత్య జీవితాన్ని నెమరు వేసుకుని, ఓ పూవును ఆ కలశం మీద పెట్టి తన దిన చర్యలు మొదలు పెట్టేవాడు. తాను చనిపోయాక తన చితి మీద ఆమె అస్తికల కలశాన్ని పెట్టాలని పిల్లలకు పలు మార్లు చెప్పేవాడు. అలా చేస్తే ఇద్దరి ఆత్మలు స్వర్గానికి చేరుకుంటాయని అతని నమ్మకం.
2022 జూన్ 24 భోలానాథ్ కూడా కన్నుమూశాడు. అయన కొరిక మేరకు ఆమె అస్తికల కలశాన్ని అతని శవం మీద పెట్టి చితి పెట్టారు. ఆ తర్వాత పాలు తేనెలా కలిసిపోయిన ఆ ఇద్దరి అస్తికలను మరో కలశంలో పెట్టి అదే మామిడి చెట్టుకు కట్టారు. విడదీయరాని వాళ్ళ బంధాన్ని పిల్లలకు చెప్పేవాళ్ళు. రోజు ఓ పువ్వును కలశం మీది పెడుతున్నారు. అందుకే భార్యా భర్తల బంధం ఏడు జన్మల బంధం అంటారు కాబోలు. వాళ్లు తప్పక మరో జన్మలో కూడా కలుస్తారు.
Also Read : తెగని మూడు ముళ్ళ బంధం- తీరం లేని ఏడు అడుగుల బంధం