బీజేపీలో ఈటల రాజేందర్ కు అత్యంత సన్నిహిత నేత సదా కేశవ రెడ్డి. బీజేపీని వీడి బీఆర్ఎస్ లోకి చేరాలని నిర్ణయించడం వెనక అసలేం జరిగింది..? సదా కేశవ రెడ్డి బీఆర్ఎస్ లో చేరాలనే నిర్ణయం వెనక అదృశ్య శక్తులు ఉన్నాయా..? ఈటల ప్రోద్బలంతోనే బీఆర్ఎస్ లో చేరేందుకు కేశవ రెడ్డి సిద్దమయ్యారా..? ఇప్పుడివే ప్రశ్నలపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా కేశవరెడ్డి బీజేపీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. కంటోన్మెంట్ బోర్డులో ఓ శాడిస్ట్ కారణంగానే బీజేపీని వీడుతున్నానని చెప్తున్నారు కానీ అసలు కారణం ఈటల రాజెందరేనన్న చర్చ బీజేపీలోనే జరుగుతోంది. తనతో విబేధించిన ఈటల మొహాన్ని కూడా చూసేందుకు ఇష్టపడని కేసీఆర్.. ఆయన్ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించారని అంటుంటారు. ఈటల అంటేనే కోపంతో ఊగిపోయే కేసీఆర్..ఇటీవలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాత్రం ఆయనపై ఎనలేని ప్రేమ చూపించారు. తన మంత్రివర్గంలో ఉన్న సమయంలో కూడా ప్రదర్శించని అభిమానాన్ని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా మారాక ఈటలపై వ్యక్తం చేశారు.
కొన్ని కీలక పథకాల అమలు విషయాల్లో ఈటలకు ఫోన్ చేసి సలహాలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పడం.. పరోక్షంగా ఈటలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించడమే. ఇందుకు పూర్వమే అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున ఈటలతో కేటీఆర్ కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. కేటీఆర్ ఫీడ్ బ్యాక్ తోనే అసెంబ్లీలో ఈటలపై కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారన్న అభిప్రాయాలూ ఉన్నాయి. దీంతో ఈటల బీఆర్ఎస్ లో చేరుతారన్న ప్రచారం బీజేపీ నుంచే జరిగింది. అదే సమయంలో వీటిపై రాజేందర్ క్లారిటీ ఇచ్చేశారు కానీ మళ్ళీ ఎక్కడ కనిపించడం లేదు. తన ఆభిమానులు,అనుచరులకు మాత్రమే ఈటల అందుబాటులో ఉంటున్నారు.
ఈ క్రమంలోనే ఈటలకు అత్యంత సన్నిహిత నేత సదా కేశవ రెడ్డి బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశం అయింది. ఈటల సూచన మేరకే సదా కేశవరెడ్డి బీఆర్ఎస్ లో చేరుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సదా కేశవరెడ్డితో ఈటలకు అనుబంధం ఉంది. అందులోనూ బీజేపీలో జాయినింగ్ కమిటీ చైర్మన్ గానున్న ఈటల చొరవ తీసుకొని కేశవరెడ్డితో మాట్లాడి ఆయనను కన్విన్స్ చేస్తే బీజేపీలోనే కేశవ రెడ్డి కొనసాగే అవకాశం ఉంది.కానీ ఈటల ఆ ప్రయత్నం చేయడం లేదు. ఇదంతా కేసీఆర్, ఈటల వ్యూహంలో భాగంగా జరుగుతోందని తెలుస్తోంది
. పార్టీని జాతీయ పార్టీగా మార్చాక మీలాంటివాళ్ళ అవసరముందని ఈటలకు కేసీఆర్ ఫోన్ చేశారన్న ప్రచారం ఉంది. అయితే ఇప్పకిప్పుడు ఈటల బీజేపీని వీడి బీఆర్ఎస్ లో చేరితే ఆయన విశ్వసనీయత సన్నగిల్లుతుంది. ఆయన ఇన్నాళ్ళు వినిపించిన ఆత్మగౌరవ నినాదం మసకబారుతుంది. అందుకే పార్టీలో తనకు సన్నిహిత నేతలను ఒక్కొక్కరికి బీఆర్ఎస్ లోకి పంపి..చివరగా బీజేపీలో ఇమడలేకపోతున్నానని ప్రకటించి కేసీఆర్ సమక్షంలో ఈటల బీఆర్ఎస్ లో చేరనున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీని ఎలా దెబ్బకొట్టాలో తనకు తెలుసునని కేసీఆర్ ప్రకటించడం వెనక ఇదే వ్యూహం దాగి ఉండొచ్చునని అంటున్నారు