ఎన్నికలు సమీపిస్తున్న సమయాన తెలంగాణ బీజేపీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. కొత్తగా పార్టీలో చేరిన నేతలతో బలీయంగా కనిపించిన బీజేపీకి ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. ఎవరు ఎప్పుడు పార్టీని వీడుతారో..? తెలియక సతమతం అవుతోంది. కీలకమైన నేతలు ఒకరిద్దరూ పార్టీని వీడినా ఈ ప్రభావం మామూలుగా ఉండదు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కనిపించిన బీజేపీ ఎందుకు ఇలా సంకట పరిస్థితిని ఎదుర్కొంటుందని పార్టీ అగ్రనేతలు ఆరా తీస్తున్నారు.
బీజేపీలో రెండు, మూడు వర్గాలు ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. గత కొద్దిరోజులుగా బండి సంజయ్, ఈటల వర్గంగా పార్టీ చీలిపోయింది. ఈటలకు అద్యక్ష బాధ్యతలు అప్పగించాలని కొత్తగా పార్టీలో చేరిన నేతలంతా కోరుతున్నారు. బండిని పదవి నుంచి తప్పించాలనుకుంటున్నారు. ఇప్పట్లో బండిని మార్చే ప్రసక్తే లేదని ఢిల్లీ పెద్దలు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో వలస నేతలు పక్కచూపులు చూస్తున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలు కాస్త ఢిల్లీని తాకాయి.
వెంటనే ఢిల్లీ నుంచి ఈటలకు పిలుపు అందింది. ఈటలను బుజ్జగిస్తే మిగతా అసంతృప్త నేతలంతా సెట్ రైట్ అవుతారని అగ్రనేతల ఆలోచన. అందుకే ఈటలకు అద్యక్ష బాధ్యతలు కాకుండా మరో కీలక పదవి ఇచ్చి పార్టీని గాడిన పెట్టాలని చూస్తున్నారు. ఎన్నికలు మరో ఐదు నెలలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రచార కమిటీ, మ్యానిఫెస్టో రూపకల్పన కమిటీ, ఎన్నికల వ్యూహల కమిటీలను ఏర్పాటు చేయాలనీ చూస్తున్నారు.
ఈ మూడు కమిటీలలో కీలకమైన కమిటీకి ఈటలను చైర్మన్ గా నియమించాలని ఢిల్లీ పెద్దలు అనుకుంటున్నారు. ఈటల బీజేపీ కాంపౌండ్ దాటి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో అధిష్టానానికి తెలుసు. అందుకే అందరికంటే ముందు ఈటలను సంతృప్తిపరిచే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు అందినట్లు సమాచారం.