తెలంగాణ బీజేపీ ఎలక్షన్ మేనేజ్ మెంట్ చైర్మన్ ఈటల రాజేందర్ తీరు ఎవరికీ అంతుచిక్కడం లేదు. బీజేపీ – బీఆర్ఎస్ ల మధ్య అన్యోన్యత స్పష్టంగా కనిపిస్తుండటంతో కేసీఆర్ ను గద్దె దించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరిన పలువురు నేతలు బీజేపీని వీడుతున్నారు. భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి తొలగించి కేసీఆర్ తనను అవమానించారని..కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యమని బీజేపీలో చేరిన ఈటల మాత్రం కమలాన్నే అంటిపెట్టుకొని ఉన్నారు. చాలా అంశాల్లో బీజేపీ – బీఆర్ఎస్ ల మధ్య సఖ్యత కనిపిస్తుందని బీజేపీని వీడుతున్న నేతలు చెప్తున్నా..సుదీర్ఘ రాజకీయ అనుభవం కల్గిన ఈటల మాత్రం ఈ విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారని ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
నిజానికి.. ఈటల బీజేపీలో చేరిక సమయంలోనే తన అనుమానాలను అగ్రనేతల ముందు ఉంచారు. కేసీఆర్ తో తెగదెంపులు చేసుకొని వచ్చిన వాళ్ళం. రాజకీయ ప్రయోజనాల కోసం భవిష్యత్ లో బీఆర్ఎస్ కు బీజేపీ మద్దతుగా నిలిస్తే తమలాంటి నేతలకు ఇబ్బంది అవుతుందని అప్పుడే ఈటల అనుమానం వ్యక్తం చేశారు. అప్పట్లో కేసీఆర్ తో డీ అంటే డీ అని యుద్ద ప్రకటనలు చేసిన బీజేపీ ,మారిన రాజకీయ పరిణామాలతో కొన్నాళ్ళుగా సైలెంట్ అయిపొయింది. కాళేశ్వరం కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఏంగా మారిందని ప్రధాని మొదలు రాష్ట్ర స్థాయి నేతల వరకు ఆరోపణలు చేస్తున్నా కేంద్ర నాయకత్వం విచారణకు ఆదేశించడం లేదు. ఆధారాలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తుంటే ఆధారాలు తీసుకునేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు వచ్చిన అందర్నీ అరెస్ట్ చేసి ఒక్క కవితను మాత్రం మినహాయించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేతల అంతు చూస్తానని ప్రకటించిన కేసీఆర్ అనూహ్యంగా చల్లబడిపోయారు. బీజేపీపై సమరమేనని ప్రకటించిన కేసీఆర్ ఆ కేసు గురుంచి మాట్లాడటమే మరిచిపోయారు.
వీటన్నింటిని ఉదాహరిస్తూ పలువురు నేతలు బీఆర్ఎస్ – బీజేపీల మధ్య అంతర్గత ఒప్పందం కుదిరిందని.. అందుకే కవిత అరెస్ట్ తప్పించుకొగలిగినదని చెప్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ గెలిచినా పరవాలేదు..కాంగ్రెస్ గెలవకూడదు అనే ఆలోచనతో బీజేపీ అసెంబ్లీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవడం లేదని అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బీజేపీ మద్దతునిస్తుందని ప్రతిగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తుందని…ఇదే వ్యూహంతో రెండు పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని చెప్తున్నారు. రాజకీయాలను పరిశీలిస్తోన్న వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ కేసీఆర్ ను ఓడిస్తానని శపథం చేసిన ఈటల..బీజేపీ – బీఆర్ఎస్ ల మధ్య అంతరంగిక ఒప్పందం ఉందనే విషయాన్ని ఎందుకు గెస్ చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. కొన్నాళ్ళుగా ఈటల వైఖరిలో చాలా మార్పు వచ్చిందని వ్యక్తీకరిస్తున్నారు.
Also Read : ప్లాప్ అయిన కేసీఆర్ ప్లాన్..!!