ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ లక్ష్యం 100సీట్లు అంటున్నారు ఆ పార్టీ నేతలు. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని ఈ సారి ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు అవుతుందని చెప్తున్నారు. అయితే. బీఆర్ఎస్ సెంచరీ మార్క్ సాధించాలంటే ఓ పని చేయాల్సి ఉందంటున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు… కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేసిన ఆయన… పార్టీ లక్ష్యమైన వంద సీట్లు రావాలంటే మాత్రం ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో 15 నుంచి 20 మందిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ కి ఓటు వేసేందుకు జనం రెడీగా ఉన్నారని… అయితే కొంత మంది ఎమ్మెల్యేల మీద కోపంగా ఉన్నారని అన్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేది లేదని కేసీఆర్ చెబుతుండగా ఎర్రబెల్లి దయాకర్ రావు 20మంది ఎమ్మెల్యేలను మార్చాలని అంటున్నారు. నిజానికి.. సిట్టింగ్ లకే టికెట్లు ఇస్తే బీఆర్ఎస్ ఓటమి ఖాయమని కేసీఆర్ చేయించిన సర్వేలో తేలింది. దాదాపు 40స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై భారీ వ్యతిరేకత ఉందని..మరోసారి వారికీ టికెట్ ఇస్తే ఓటమిని ఆహ్వానించినట్లు అవుతుందని ఈ సర్వే నివేదికలో తేలింది. ఈ విషయంపై ఇటీవల మంత్రి ఎర్రబెల్లితో కేసీఆర్ చర్చించారని టాక్.
పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ..40మంది ఎమ్మెల్యేలను మార్చాలని మాట్లాడితే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఎర్రబెల్లి 20సీట్లు తక్కువ చేసి చెప్పారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే 20స్థానాల్లో ఎమ్మెల్యేలను మార్చితే బీఆర్ఎస్ సెంచరీ మార్క్ చేరుకుంటుందని ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరుగుతుండగా.. ఆ 20నియోజకవర్గాలు ఎవై ఉండొచ్చునని అందరూ ఆరా తీస్తున్నారు.
కొడంగల్ – పట్నం నరేందర్ రెడ్డిని మార్చాల్సిందేనని అనుకుంటున్నారు. కాని రేవంత్ కు తగ్గ లీడర్ కోసం బీఆర్ఎస్ అధిష్టానం అన్వేషిస్తోంది. గురునాథ్ రెడ్డిని బరిలో నిలిపే అంశాన్ని పరిశీలిస్తోంది.
ఖైరతాబాద్ – దానం నాగేందర్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. కేసీఆర్ చేయించిన సర్వేలో ఇది తేలింది. కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ , కార్పొరేటర్ విజయా రెడ్డిలు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదీ ఏమైనా ఇక్కడ కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు ఎక్కువ. అయితే.. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి వలన ఓటు బ్యాంక్ చీలితే అది బీఆర్ఎస్ కే లాభం చేకూర్చనుంది.
పఠాన్ చెరు – గూడెం మాహిపాల్ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. కాంగ్రెస్ నుంచి గాలి అనిల్ కుమార్ బరిలో ఉండే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కాట శ్రీనివాస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అదే సమయంలో లోక్ సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా పోటీ చేసిన గాలి ఈ నియోజకవర్గం నుంచి గణనీయమైన ఓట్లను పొందటంతో ఈయన బరిలో ఉంటే కాంగ్రెస్ గెలుపుకు అవకాశాలు అత్యధికంగా ఉన్నట్టు తేలింది.
ఎల్బీనగర్ – వచ్చే ఎన్నికల్లో సుధీర్ రెడ్డి అస్సలు గెలిచే అవకాశం లేదు. పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ లో చేరిన ఆయన క్యాడర్ ను మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆయనతో బీఆర్ఎస్ లో చేరిన నాయకులూ తిరిగి మల్ రెడ్డి సోదరుల అండతో కాంగ్రెస్ గూటికి చేరారు.
అచ్చంపేట – గువ్వల బాలరాజు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన అచ్చంపేటలో ఈసారి కాంగ్రెస్ గెలిచే అవకాశమే ఎక్కువ ఉంది. దళిత బంధు మ్యాజిక్ చేస్తుందని, ఆర్ధిక బలంతో నెగ్గుకురావొచ్చునని గువ్వల భావిస్తున్నారు, కాని పలు మండలాల్లో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. గ్రాఫ్ పడిపోతుందని గతంలోనే గువ్వలను కేసీఆర్ హెచ్చరించారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా ఎంపీ రాములు కుమారిడిని బీఆర్ఎస్ వర్గాలే ప్రోత్సహిస్తుండటం గమనార్హం.
కొల్లాపూర్ – హర్షవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరాడు. ఈయనపై కూడా వేటు పడే అవకాశం ఉంది.
తాండూర్ : పైలెట్ రోహిత్ రెడ్డిని తప్పించే అవకాశం ఉంది.
పినపాక : రేగా కాంతారావుకు కూడా నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది.
అయితే… ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోని నలుగురు ఎమ్మెల్యేలను తప్పిస్తే బీజేపీ వాదనలకు బలం చేకూర్చుతుందని కేసీఆర్ భావిస్తే వీరిలో ఒకరికి మరో అవకాశం ఇస్తుండోచ్చు.
కల్వకుర్తి – జైపాల్ యాదవ్ ను తప్పించి మరో నేత( జడ్పీ వైస్ చైర్మన్ ) కు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది.
మహబూబాబాద్ : శంకర్ నాయక్ పై వేటు తప్పనిసరి
ఉప్పల్ – బేతి సుభాష్ రెడ్డి
మేడ్చల్ – మల్లారెడ్డికి కూడా టికెట్ అనుమానమే.
పాలేరు – తుమ్మల కోసం కందాలను తప్పించే అవకాశం ఉంది
బోధన్ – షకీల్ ఆహ్మాబ్ ను మార్చే అవకాశం ఉంది.
దేవరకొండ – రవీందర్ నాయక్ కు ప్రత్యామ్నాయ నేతకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు.
నర్సాపూర్ : చిలుముల మదన్ రెడ్డి తప్పించడం ఖాయం.
కొత్తగూడెం – వనమా వెంకటేశ్వర్ రావుకు టికెట్ ఈసారి గల్లంతే
మునుగోడు – వామపక్షాలకు కేటాయించనున్నారు
చెన్నూరు : బాల్క సుమన్ ను తప్పించి ఎమ్మెల్సిగా అవకాశం ఇచ్చి కేబినేట్ లోకి తీసుకోనున్నారని టాక్
ఎల్లారెడ్డిలో నూ సిట్టింగ్ కు మరో అవకాశం కష్టమే.
పైన పేర్కొన్న ఈ 20స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ వేటు వేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.