తెలంగాణ కాంగ్రెస్ లో ఆశాజనకమైన మార్పు కనిపిస్తోంది. హత్ సే హత్ జోడో యాత్రతో నేతలంతా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వివరిస్తూ…కాంగ్రెస్ అధికారంలోకి ఏం చేస్తుందో చెబుతున్నారు. ఎవరెవరు యాత్రలు చేస్తున్నారో, ఎవరెవరు చేయడం లేదో ఫీడ్ బ్యాక్ ను అధిష్టానం కోరుతుండటంతో నేతలు సీరియస్ గా ఈ హత్ సే హత్ జోడో యాత్రలను చేస్తున్నారు. ఒక్క కోమటిరెడ్డి మినహా నేతలంతా పాదయాత్రలు చేస్తున్నారు. త్వరలోనే ఆయన కూడా యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.
టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి హత్ సే హత్ జోడో యాత్ర యాత్రపేరుతో ములుగు నుంచి యాత్ర చేపట్టారు. రెండు నెలలపాటు జనంలోనే ఉండేలా ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. రేవంత్ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ లో మునుపటి జోష్ కనిపిస్తోంది. సీనియర్లు సైతం ఆయనకు మద్దతు ప్రకటించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు వీహెచ్, మధుయాష్కీ, మహేష్ కుమార్ గౌడ్ తోపాటు పలువురు రేవంత్ యాత్రకు హాజరై సంఘీభావం తెలిపారు. ఇది కాంగ్రెస్ లో నూతనోత్తేజం నింపేలా చేస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే కొంచెం గాడిన పడినట్లే కనిపిస్తోంది. రేవంత్ సహా కీలక నేతలంతా జనాల్లో ఉండటంతో ముందు పార్టీ.. ఆ తరువాత పదవుల పంపకం అనే ఆలోచనకు సీనియర్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మార్పు పట్ల పార్టీ క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇదే ఊపును ఎన్నికల వరకు కొనసాగిస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఆపేగలిగే శక్తి ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి పాదయత్రకు మెయిన్ స్ట్రీం మీడియా పెద్దగా స్పెస్ ఇవ్వకపోయినా ఆయన యాత్రకు వస్తున్న స్పందన ఊహించని విధంగా ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నాడు వైఎస్సార్ పాదయాత్ర కాంగ్రెస్ తలరాత ఎలాగైత్తే మార్చిందో ఇప్పుడు రేవంతుడి యాత్ర కూడా అదే విధంగా మార్చనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో మిగిలిన సీనియర్లు కూడా రేవంత్ యాత్రకు మద్దతు తెలిపెందుకు వస్తారని నమ్మకంగా చెబుతున్నారు. మొత్తంగా రేవంత్ “యాత్ర” తో తెలంగాణ కాంగ్రెస్ లో ఈక్వేషన్స్ వేగంగా మారుతున్నాయి.