వద్దూ.. వద్దూరో.. ఓ దొరో.. మీ పాలనొద్దురో.. ఓ దొరో అంటూ తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలనకు వ్యతిరేకంగా గజ్జే కట్టి, పాట పాడిన ఎపూరి సోమన్న ఇప్పుడు అదే అధికార పార్టీ(బీఆర్ఎస్ )లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాసేపటి క్రితమే మంత్రి కేటీఆర్ ను కలిసి ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడంతో ఆయన బీఆర్ఎస్ లో చేరిక ఖాయంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలను చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ళకే సాంస్కృతిక సారధిలో ఉద్యోగాన్ని సైతం వదిలేసి..గోసి, గొంగడి వేసి కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమ గీతాలను ఆలపించిన సోమన్న… ఇప్పుడు ఆ పాలకులకు వంగి దండాలు పెట్టడం ఆశ్చర్యపరుస్తోంది.
మల్లన్న సాగర్ , నిరుద్యోగులు అంశం, తెలంగాణ అమరవీరులు, ప్రాజెక్టులో కమిషన్లపై ఎన్నో పాటలు రాసి పాడిన ఎపూరి సోమన్న తెలంగాణ ఏర్పాటు తరువాత తనదైన గుర్తింపు పొందారు. మల్లన్న సాగర్ భూనిర్వాసితులపై ఆయన పాడిన.. అమ్మా మన ఊరు ఆగమైతుందే అనే పాట ఎంతోమందిని కన్నీళ్లు పెట్టించింది. తన పాటతో చైతన్యం, కన్నీళ్ళు పెట్టించగలిగే సోమన్న బీఆర్ఎస్ కు దగ్గర అవుతారని ఎవరూ ఊహించలేదు. కాని ఆయన సడెన్ గా ప్రగతి భవన్ లో కేటీఆర్ ను ఆలింగనం చేసుకున్న దృశ్యాలు చూసి సోమన్న కూడా అమ్ముడుపోయాడా..? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ తరుఫున తుంగతుర్తి నుంచి పోటీ చేసేందుకు ఆయన రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతున్నట్లు పరిణామాలు కనిపించడంతో కొన్నాళ్లుగా వైఎస్సార్ టీపీ కార్యక్రమాలు నిలిచిపోయాయి.
అప్పటి నుంచి సోమన్న కూడా పెద్దగా ఎక్కడ కనిపించలేదు. సాయి చంద్ మరణం తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పటు బీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా మెదలటం కనిపించింది. గద్దర్ సంస్మరణ సభలో సోమన్న మాట్లాడుతూ.. దళితులు ఎదుగుతున్న నాయకత్వం ఏ పార్టీలో ఉన్నా సహకరించుకునే ధోరణితో సాగుదామని పిలుపునివ్వడం హాట్ టాపిక్ అయింది. కానీ సోమన్న పార్టీ మారుతారని అందులోనూ బీఆర్ఎస్ లో చేరుతారని ఎవరూ అంచనా వేయలేదు. ఎందుకంటే పాట అంటే ప్రశ్న అని.. అది ఎప్పుడు రాజ్యానికి ప్రతిపక్షంగా ఉంటుందని మాట్లాడిన సోమన్న .. ఇప్పుడు కేటీఆర్ తో భేటీ కావడం సంచలనంగా మారింది.
బీఆర్ఎస్ లో సోమన్న చేరడం ఖాయమైందని… త్వరలోనే ఆయన అధికారికంగా పార్టీలో చేరుతారని తెలుస్తోంది. సాయిచంద్ లేని లోటు బీఆర్ఎస్ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ లోటును భర్తీ చేసే ఆలోచనతోనే బాల్క సుమన్ ను రంగంలోకి దించి సోమన్నతో సంప్రదింపులు జరిపి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఏదీ ఏమైనా.. సోమన్న బీఆర్ఎస్ లో చేరికపై చాలా విమర్శలు చెలరేగే అవకాశం ఉంది.