టీ-20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా దారుణ పరాజయం మూటగట్టుకుంది. పది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గ్రేట్ విక్టరీ సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20ఓవర్లలో 168పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కు నిర్దేశించింది. టీమిండియా బ్యాట్స్ మెన్ లో ఓపెనర్లు మరోసారి పూర్తిగా నిరాశపరిచారు. రెండో ఓవర్ లోనే కేఎల్ రాహుల్ అవుట్ కాగా, 28బంతుల్లో 27పరుగులు చేసి రోహిత్ శర్మ భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 40 బంతుల్లో 50పరుగులు చేసి డెత్ ఓవర్లలో రాంగ్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. ఆ తరువాత హార్దిక్ (33 బంతుల్లో 66పరుగులు ) చివర్లో బ్యాట్ ఝులిపించడంతో టీమిండియా 168పరుగులైన చేయగలిగింది.
ఇక , బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ మొదటి ఓవర్ నుంచే టీమిండియా బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. జోస్ బట్లర్ (49బంతుల్లో 80) ఎడాపెడా ఫోర్లు బాదటంతో పవర్ ప్లే లోనే స్కోర్ ఇంగ్లాండ్ యాభై పరుగులు పూర్తి చేసుకుంది. ఆ తరువాత బాదుడును మరో ఓపెనర్ అలెక్స్ హెల్స్ (47బంతుల్లో 86 పరుగులు) తీసుకున్నాడు.ఈ ఇద్దరి ఓపెనర్ల సుడిగాలి ఇన్నింగ్స్ కు టీమిండియా నిర్దేధించిన లక్ష్యం చిన్నబోయింది. కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేశారంటే ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ వీరబాదుడు ఎలా సాగిందో చెప్పొచ్చు.
ఇంగ్లాండ్ బౌలర్లు రాణించిన పిచ్ పై టీమిండియా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. అందరూ ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. వికెట్ల మాట దేవుడెరుగు కాని, సిక్స్, ఫోర్లను రాకుండా కట్టడి చేయడం బౌలర్లకు గగనమైంది. దాదాపు అన్ని మ్యాచ్ లోనూ రాణించిన బౌలర్లు సెమీ ఫైనల్ లో మాత్రం పూర్తిగా తడబడ్డారు.సెమీ ఫైనల్ లో ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్ , పాక్ తో ఫైనల్ లో తలపడనుంది.