దేశంలో హెచ్3ఎన్2 వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఈ వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇన్ఫ్లూయెంజా ఏ రకం వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు బయటపడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఈ వైరస్ ప్రభావం చిన్నారులు, వృద్దులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వారిపై అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులపై ఈ ప్రభావం ఉంటుందన్న నిపుణుల హెచ్చరికలతో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పది రోజులపాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.
హెచ్3ఎన్2 వైరస్ కేసులు దేశంలో పెరుగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరోసారి కరోనా తరహ పరిస్థితులు దేశంలో తలెత్తే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాంతో ముందస్తు చర్యలో భాగంగా పుదుచ్చేరి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పదిరోజులపాటు విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. మార్చి 16 నుంచి 26 వరకూ పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్ఫ్లూయెంజా ఏ వైరస్ వల్ల పిల్లలకు ముప్పు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్రపాలిత ప్రాంతంలో పుదుచ్చేరి, కరైకల్, మహే, యానాం ప్రాంతాల్లో అన్ని పాఠశాలలను మూసివేయాలని విద్యా శాఖ మంత్రి ఏ నమశ్శివాయం పేర్కొన్నారు. మరోవైపు హెచ్3ఎన్2తో పాటు కోవిడ్-19, స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో ఇప్పటివరకు వెయ్యికి పైగా హెచ్3ఎన్2 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులోని 545, మహారాష్ట్రలో 352, గుజరాత్ లో 180, కేరళలో 50, పంజాబ్ లో 30 కేసులు నమోదయ్యాయి. జనవరిలో శ్వాసకోశ అనారోగ్య కేసులు 3.97 లక్షలు నమోదు కాగా, ఇన్ఫ్లూయెంజా వంటి అనారోగ్య కేసులు కూడా నమోదయ్యాయి. ఫిబ్రవరి నెలలో ఈ కేసుల సంఖ్య 4.36 లక్షలు కాగా.. మార్చి నెలలో మొదటి 9 రోజుల్లో 1.33 లక్షల కేసులు నమోదయ్యాయని ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫారమ్ డేటా వెల్లడించింది. ఈ గణాంకాలను పరిశీలించి… వైద్య నిపుణుల హెచ్చరికలతో పుదుచ్చేరి సర్కార్ పదిరోజులపాటు విద్యా సంస్థలను మూసివేస్తిన్నట్లు ప్రకటించింది.
Also Read : బిగ్ న్యూస్ : పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం