లిక్కర్ స్కామ్ లాభాలను కవిత హైదరాబాద్ లో భూములను కొనుగోలు చేసేందుకు వినియోగించారని అనుమానిస్తోన్న ఈడీ…పలు రియల్ ఎస్టేట్ సంస్థలపై ఫోకస్ పెట్టింది. లిక్కర్ దందాలో వచ్చిన లాభాలతో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు..? వంటి అంశాలను వెలికితీయడంలో ఈడీ నిమగ్నమైంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను సేకరించిన ఈడీ…త్వరలోనే రియల్ ఎస్టేట్ కంపెనీలపై దాడులు చేయనున్నట్లు తెలుస్తోంది.
లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బుతోనే కవిత వట్టినాగులపల్లిలో భారీ ఎత్తున భూములు కొన్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు, లిక్కర్ స్కామ్ లో కవిత ప్రతినిధిగా వ్యవహరించిన పిళ్ళైలు ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ మరింత లోతైన సమాచారం సేకరించింది.
భూముల కొనుగోళ్ళ కోసం పిళ్ళై ఖాతా నుంచే క్రియేటివ్ గ్రూప్ కు మూడు విడతల్లో నగదు బదిలీ అయినట్లు గుర్తించిన ఈడీ…కవిత ఆదేశాలతో పిళ్ళై నగదు బదిలీ చేసినట్లు అనుమానిస్తోంది. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను రాబట్టాలనుకుంటుంది ఈడీ. ఈ నేపధ్యంలోనే మూడు రియల్ ఎస్టేట్ సంస్ధలు ఫీనిక్స్, ఎస్ గ్రోత్, క్రియేటివ్ డెవలపర్స్ పై ఈడీ దృష్టిసారించింది.
ఈ మూడు రియల్ ఎస్టేట్ సంస్థల్లో రెండు సంస్థలకు కవిత భర్త అనిల్ డైరక్టర్ గా ఉన్నారు. అనిల్ డైరక్టర్ కాగానే బిజినెస్ కూడా వృద్ది చెందినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ విషయాలను సవివరంగా స్పెషల్ కోర్టుకు సమర్పించిన మూడో చార్జీషీట్ లో ఈడీ ప్రస్తావించింది.
కవిత తనకున్న రాజకీయ పలుకుబడితోనే తక్కువ ధరకు భూములను కొనుగోలు చేశారని అంచనా వేసిన ఈడీ త్వరలోనే పలు రియల్ ఎస్టేట్ సంస్థలపై దాడులు చేసే అవకాశం ఉంది. అవసరమైతే రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలకు డైరక్టర్ గానున్న కవిత భర్తను ఈడీ విచారణకు రావాలని నోటిసులు పంపే సూచనలు కనబడుతున్నాయి.
హైదరబాద్ లో భూముల కొనుగోళ్ళు , లావాదేవీలపై ఆరా తీసే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పిళ్ళై ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కవితతోపాటు ఆమె భర్తను కూడా విచారిస్తే అసలు విషయాలు నిగ్గు తేలుతాయని ఈడీ భావిస్తోందని చెబుతున్నారు.