ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను కాపాడే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల సీబీఐ దాఖలు చేసిన ఓ కౌంటర్ లో కవిత ప్రస్తావనే లేకుండా పోవడంతో.. లిక్కర్ స్కాం నుంచి కవిత సేఫ్ అనే వాదనలు వినిపించాయి. తాజాగా ఈడీ దాఖలు చేసిన పిటిషన్ లో మాత్రం మొత్తం కవితే చేశారని పేర్కొంది. అరుణ్ రామచంద్ర పిళ్ళై బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ ఈడీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ లో కవిత పాత్రను ప్రధానంగా పేర్కొంది ఈడీ.
మద్యం కుంభకోణంలో ఇండోస్పిరిట్ వాటాల్లో కవితనే అసలైన పెట్టుబడిదారు అని పిళ్ళై అంగీకరించినట్లు ఈడీ వెల్లడించింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో కవిత, ఆప్ నేతల మధ్య ఒప్పందం ఉన్నట్లు పిళ్ళై స్టేట్ మెంట్లు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ కేసులో నిందితులతో కవితకున్న సంబంధాలను వారి స్టేట్ మెంట్ల రూపంలో మెన్షన్ చేసింది. ఇండో స్పిరిట్ కంపెనీ లో కవిత పెట్టుబడులపై పిళ్ళై ఇచ్చిన వాంగ్ములాన్ని పేర్కొంది ఈడీ.
కవితకు పిళ్ళై బినామీగా వ్యవహరించినట్లు అంగీకరించారని ఈడీ స్పష్టం చేసింది. అలాగే,లిక్కర్ దందాలో ఢిల్లీ సిఎం , నాటి డిప్యుటీ సీఎంగానున్న సిసోడియా , కవితల మధ్య ఒప్పందం ఉన్నట్లు కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్ మెంట్ ను ఈడీ ప్రస్తావించింది. ఈ ముగ్గురే లిక్కర్ బిజినెస్ లో చక్రం తిప్పారని చెబుతోంది.
మొత్తంగా చూస్తె కవిత విషయంలో సీబీఐ ఉదారంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుండగా.. ఈడీ మాత్రం కవిత పాత్రను నిగ్గు తేల్చే పనిలో దూకుడుగా వ్యవహరిస్తోంది.